తెరాస ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తూ నేటికీ తెదేపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెదేపా నేతలు స్పీకర్ మధుసూదనాచారికి, గవర్నర్ నరసింహన్ కి అనేకసార్లు విజ్ఞప్తులు చేసారు. కానీ వారు స్పందించలేదు. ఈవిషయాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తాలని ప్రయత్నించారు. కానీ కుదరలేదు. చివరికి హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఫలితం లేకపోయింది. నాతిక విలువలకి కట్టుబడి తన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసానని గొప్పగా ప్రకటించుకొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా దీని గురించి నోరు మెదపడం లేదు.
వేరే పార్టీ ఎమ్మెల్యే చేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడమే తప్పు అనుకొంటుంటే అతనితో కలిసి గవర్నర్ పర్యటనలు చేస్తున్నారని తెదేపా తెలంగాణా శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గవర్నర్ తెరాస ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆయనపై కేంద్రానికి పిర్యాదు చేస్తామని అన్నారు. తలసాని మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ విర్ద్దామని కనుక ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రపతికి, ప్రధాని మోడీకి, హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ కి, గవర్నరు నరసింహన్ కి లేఖలు వ్రాసారు.
బహుశః ఆ విమర్శలు, లేఖల కారణంగానే గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారం పరిశీలించి తగిన చర్యలు చేప్పట్టాలనికోరుతూ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఒక లేఖ వ్రాసారు. కానీ ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలనే పట్టించుకొని తెలంగాణా ప్రభుత్వం గవర్నర్ కార్యదర్శి వ్రాసిన లేఖను పట్టించుకొంటుందని భావించలేము.