ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఏపీలో ఎన్నికల సందర్భంగా ఏర్పడిన పరిస్థితులు.. అధికార యంత్రాంగం తన ఆదేశాలు లెక్క చేయకపోవడం.. ఏకగ్రీవాలు.. హింస.. తదితర వాటన్నింటిపై.. ఓ సమగ్రమైన లేఖను కేంద్రానికి పంపిన ఒక్క రోజులోనే.. రియాక్షన్ అనూహ్యంగా ఉంది. కేంద్ర బలగాలతో.. ఎస్ఈసీ కి ఆయన కార్యాలయానికి హైదరాబాద్, విజయవాడల్లోని ఇళ్లకు రక్షణ కల్పించారు. వెంటనే.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్… సీఎంవో మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్న అధికారి ప్రవీణ్ ప్రకాష్‌తో పాటు.. చీఫ్ సెక్రటరీ నీలం సహాని, డీజీపీ గౌతం సవాంగ్‌లను రాజ్‌భవన్‌కు పిలిపించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న ముగ్గురు అధికారులను గవర్నర్ హఠాత్తుగా పిలిపించడంతో పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది.
రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని కేంద్రం నిర్ణయానికి వచ్చిందా..?
రాజ్యాంగ పరంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఎస్ఈసీ ఆదేశాలను ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అమలు చేయకపోవడం అంటే.. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినట్లే. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు అయినా తీసుకోవచ్చు. ఏ ప్రభుత్వం అయినా.. రాజ్యాంగబద్ధంగా ఏర్పడుతుంది. రాజ్యాంగపరంగా పని చేయాలి. కానీ ఏపీ సర్కార్ రాజ్యాంగ పరంగా ఏర్పడినా.. రాజ్యాంగంలోని ఇతర వ్యవస్థల పట్ల కనీస మర్యాద పాటించడంలేదు. స్వయంగా ముఖ్యమంత్రి ఎస్ఈసీకి కులం ఆపాదించి విమర్శించడం.. ఆ తర్వాత మంత్రులు ..ఎంపీలు కూడా.. హెచ్చరికలు చేయడం.. అదే సమయంలో.. ఎస్ఈసీ ఇచ్చిన అధికారుల బదిలీ ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరించడం.. సీఎస్ తిరిగి ఎన్నికలు నిర్వహించాలని లేఖ రాయడం.. మొత్తంగా.. తప్పు మీద తప్పు చేస్తూ.. పోయినట్లయింది. వీటన్నింటినీ.. ఎస్ఈసీ లేఖలో పేర్కొనడంతో కేంద్రం రాష్ట్రంలోని పరిస్థితులపై నివేదికను గవర్నర్ వద్ద నుంచి కోరినట్లుగా తెలుస్తోంది.
డీజీపీ, సీఎస్‌లను పిలిపించి వివరణ తీసుకున్న గవర్నర్ ..!
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి.. గత పది నెలల కాలంలో వచ్చిన ఆరోపణలు… రెండు సార్లు డీజీపీ హైకోర్టు ముందుచేతులు కట్టుకుని నిలబడాల్సి రావడం.. రాజకీయ కోసం.. నేతలపై దొంక కేసులు పెట్టడం.. వంటి వాటిపై.. సమగ్ర నివేదికను.. గవర్నర్ సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలు హైలెట్ కాబోబుతున్నాయి. దీనిపై డీజీపీ గౌతం సవాంగ్ వద్ద గవర్నర్ వివరణ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అంతా చట్ట ప్రకారం చేస్తున్నామని… ఎన్నికల హింసపై కేసులు నమోదు చేశామని సవాంగ్ గవర్నర్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. అందరి కంటే ఎక్కువగా చీఫ్ సెక్రటరీ చిక్కుల్లో పడ్డారు. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ.. ఎన్నికలు నిర్వహించాలని.. లేఖ రాయడం .. అదీ కూడా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా లేఖ రాయడం ఏమిటనేదానిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె తన వాదన వినిపించారు. ప్రవీణ్ ప్రకాష్.. ముఖ్యమంత్రి తరపున కొన్ని అంశాలు నివేదించినట్లుగా చెబుతున్నారు.
గవర్నర్ నివేదిక పంపిన తర్వాత ఏపీలో సంచలనాలుంటాయా..?
ఎస్ఈసీ లేఖ ఆధారంగా.. కేంద్రం నివేదిక తెప్పించుకోవడానికి సిద్ధమయిందన్న వార్త.. ఏపీ సర్కార్‌లో కలకలం రేపుతోంది. ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్న ఉద్దేశంతో.. ముఖ్యమంత్రి రోజులో పలు మార్లు సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లతో సమావేశాలు నిర్వహించారు. ఎలా ముందుకెళ్లాలన్నదానిపై చర్చలు జరిపారు. గవర్నర్ కూడా.. కేవలం అధికారులు ఇచ్చేసమాచారం మీద కాకుండా.. తన వద్దకు వస్తున్న ఫిర్యాదులు.. సాక్ష్యాల పరిశీలన జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. విపక్షాల ఫిర్యాదులపై ఆయన ఆధారాలు అడిగి తీసుకుంటున్నారు. శాంతిభద్రతలు క్షీణించాయని.. గవర్నర్ .. నివేదిక కేంద్రానికి వెళ్తే.. మాత్రం.. సంచలనం మార్పులు ఏపీలో ఉండే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.