పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ, ప్రభుత్వం ఢీ అంటే ఢీ అన్నట్లుగా తలపడుతూండటంతో గవర్నర్ రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. ముందుగా ఎస్ఈసీ నిమ్మగడ్డను.. తర్వాత ప్రభుత్వ వైపు ప్రతినిధుల్ని పిలిపించి మాట్లాడారు. ముందుగా నిమ్మగడ్డ భేటీ అయ్యారు. ఇరవై నిమిషాల సేపు సాగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఇచ్చిన ఆదేశాలపై వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలతో తాను ఈ డైరెక్షన్స్ ఇవ్వాల్సి వచ్చిందని గవర్నర్ కు వివరించినట్లుగా తెలుస్తోంది.
గవర్నర్తో ఎస్ఈసీ భేటీ ముగియగానే.. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం గవర్నర్ తో భేటీ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ అసెంబ్లీ లో ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ పై ప్రివిలేజ్ కమిటీ చర్యల విషయంపై గవర్నర్ ప్రభుత్వాన్ని వివరణ కోరినట్టు తెలుస్తోంది. వారు అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో ప్రవీణ్ ప్రకాష్.. తనకు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా వివరణ ఇచ్చారు. వీరి మధ్య భేటీ దాదాపుగా గంట సేపు సాగింది. ఇలా భేటీ ముగిసిన తర్వాత అలా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో నిలిపివేసిన ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ చొరవతో ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.