అసంతృప్తో, అసహనమో తెలీదుగానీ… తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తన పర్యటనలకు సంబంధించి వివరణ ఇచ్చినట్టుగానే మాట్లాడారు. తానేం చేస్తున్నా కొన్ని రాజకీయ పార్టీలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని ఆయన అన్నారు. తనపై విమర్శలు తప్పడం లేదని వాపోయారు! అంతేకాదు, తాను తెలంగాణ రాష్ట్ర సమితి ఏజెంట్ గా పనిచేయడం లేదని చెప్పుకున్నారు. తన పర్యటనల వెనక రాజకీయ కోణం చూడొద్దనీ, ప్రాజెక్టుల పనితీరు ఎలా ఉంటోందనేది స్వయంగా తెలుసుకోవడం కోసమే వెళ్తున్నానని చెప్పారు. ఎక్కడైనా లోపాలు ఉంటే, వెంటనే దానిపై స్పందించేందుకే ప్రయత్నిస్తున్నాను అని నరసింహన్ అన్నారు.
తాను ప్రభుత్వంపై ఆధారపడననీ, తాను ఏదైనా స్వయంగా చూస్తేనే నమ్ముతానని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే టీవీ చూస్తే సరిపోతుందనీ, కానీ తాను అలా చేయడం లేదన్న అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల పరిస్థితిని తెలుసుకోవడం కోసం తాను వేర్వేరు ప్రాంతాలకు వెళ్తుంటాననీ, అధికారులు నిర్ణయించిన ప్రదేశాలకు కాకుండా, తాను సొంతంగా నిర్ణయించుకున్న చోటుకి వెళ్తున్నానని నరసింహన్ చెప్పారు. తానే స్వయంగా ప్రజలతో మాట్లాడి, పరిస్థితులను తెలుసుకుంటానని అన్నారు. అధికారులు చెప్తున్నారు కదా అని వినేసి సంతృప్తి చెందడం తనకు అలవాటు లేదన్నారు. తాను ఎవ్వర్నీ నమ్మననీ, తనను మాత్రమే తాను నమ్ముతాననీ, అందుకే స్వయంగా అన్ని ప్రాంతాలకు వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. చివరికి, తాను గుడికి వెళ్తున్నా విమర్శిస్తున్నారనీ, అక్కడికి వెళ్లేది కూడా ప్రజల బాగు గురించి ప్రార్థించడానికేననీ, ప్రజలను ఆనందంగా ఉచ్చేట్టు చూడటం తన బాధ్యత అని గవర్నర్ చెప్పారు.
గవర్నర్ ఇంతగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? ఆయనపై విమర్శలు ఎందుకొస్తుంటాయి..? కారణం కూడా ఆయన వ్యవహరించిన తీరే కదా! తెలంగాణకు వచ్చేసరికి.. కాంగ్రెస్ పార్టీ నేతలతో ఒకలా వ్యవహరిస్తారనే విమర్శ ఉంది. కాబట్టి, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూనే ఉంటారు. ఇక, ఆంధ్రాకి వచ్చేసరికి… ఆయన అక్కడికి వెళ్తున్న సందర్భాలే తక్కువ! తెలంగాణలో కాళేశ్వరం, మిషన్ భగీరథలతోపాటు ఇతర కార్యక్రమాలకు వెళ్లానని ఆయనే అంటారు. కానీ, ఆంధ్రాకి వచ్చేసరికి.. పట్టిసీమ, పోలవరం, అమరావతి ప్రాంతాల్లో ఆయన విరివిగా పర్యటించిన ట్రాక్ రికార్డు కనిపించదు. ఆ విమర్శ కూడా ఉంది కదా! ఆయన ఉభయ రాష్ట్రాలకూ గవర్నర్ గా ఉన్నప్పుడు… రెండువైపులా ఒకే రకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపించాలి. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలతోనే ఒకే వైఖరితో ఉన్నట్టు.. ఆయా రాజకీయ పార్టీలకు అనిపించాలి. అలా అనిపించడం లేదు కాబట్టే, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది, ఇలా వివరణలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోంది.