ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతి వారం రాసే వీకెండ్ కామెంట్లో.. గవర్నర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన వల్లే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కాకపోగా.. ప్రధాని మోడీ దృష్టిలో చంద్రబాబు పేచీకోరుగా ముద్రపడ్డారని.. ఆర్కే చెప్పారు. ఇందులో ఎంత నిజం ఉందో కానీ… గవర్నర్ ప్రవర్తనను ఈ నాలుగేళ్ల కాలంలో చూస్తే మటుకు.. ఎంతో కొంత అనుమానం కలగక మానదు.
కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. కేసీఆర్ ఎప్పుడు వెళ్లినా.. పాదనమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకుంటారు. చాలా సందర్భాల్లో పట్టుబట్టలు పెడుతూంటారు. ప్రభుత్వం తరపున తీసుకున్న ఏ చిన్న నిర్ణయమైనా స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి చెప్పి వస్తూంటారు. సాధారణంగా ఎవరి మాటా వినని కేసీఆర్ .. గవర్నర్‌కు అత్యంత గౌరవం ఇస్తూంటారు. ఇదే గవర్నర్‌ని తెలంగాణ ఉద్యమ సమయంలో.. అత్యంత తీవ్రంగా విమర్శించారు. అది వేరే విషయం. గవర్నర్‌కు కేసీఆర్ ఇంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక.. ఉన్న కేంద్రంతో…చక్కబెట్టుకోవాల్సిన వ్యవహారాలేనన్న అంచనాలున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి గవర్నర్‌ను ఆయన అధికారాల వరకే పరిమితం చేశారు. ఆయనకు అనవసర ప్రాధాన్యత ఇవ్వలేదు. తనను పట్టించుకోని ముఖ్యమంత్రి కన్నా… పాదనమస్కారాలు చేసే సీఎంకు.. ప్రయారిటీ ఇవ్వడం తప్పులేదనుకున్నట్లున్నారు నరసింహన్. ప్రతి విషయంలోనూ.. ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం.. ఉన్నత విద్యామండలి కేసులో.. ఏపీకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. కానీ ఇంత వరకూ దాన్ని అమలు చేయలేదు. కేంద్రం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది. నిజానికి ఒక్క కేసు ప్రామాణికంగా.. ఉమ్మడి సంస్థల విభజన పూర్తయిపోయేదే. కేంద్రం ఏపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వెనుక గవర్నర్ ఉన్నారని… మంత్రి గంటాతో పాటు ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా భావించారు. అందుకే వారెవరూ రాజ్‌భవన్ వైపు కన్నెత్తి చూడలేదు. ఆ తర్వాత మంత్రుల కమిటీలు రెండు, మూడు సార్లు భేటీ అయ్యాయి…కానీ అందులో గవర్నర్ తెలంగాణ ప్రతినిధిగా వ్యవహరించడంతో… ఎక్కడిదక్కడ ప్రతిష్టంభన ఏర్పడింది.
ఇక కేంద్రం దూతగా… రాజ్‌భవన్‌ను రాజకీయాలకు వాడుకుకుంటున్న విషయం చాలా సార్లు స్పష్టమయింది. పవన్ కల్యామ్.. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారడానికి ఒకే ఒక్క కారణం.. గవర్నరేనని.. టీడీపీ వర్గాలు ఇప్పటికీ బలంగా చెబుతూంటాయి. పవన్ కల్యాణ్‌కు రాజకీయ ఆశలు కల్పించారా..మరో విధంగా మభ్యపెట్టారా అన్నదానిపై అనేక అనుమానాలున్నా.. ఈ విషయంలో గవర్నరే కీలక పాత్ర పోషించారంటున్నారు. తను ఇచ్చిన నివేదికల వల్లే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. వ్యతిరేక భావం ఏర్పర్చుకుని.. చంద్రబాబు పేచీలు పెడుతున్నట్లు లోక్శభలో చెప్పారని.. భావిస్తున్నారు. దానికి సాక్ష్యంగా.. గవర్నర్ ప్రస్తావన కూడా మోడీ తీసుకొచ్చారు.