కాంగ్రెస్ లోకి వచ్చాక రేవంత్ రెడ్డి కొంత దూకుడు మళ్లీ పెంచిన సంగతి తెలిసిందే! తాజాాగా ఢిల్లీలో జరిగిన పరిణామాల స్ఫూర్తితో కొంతమంది తెరాస ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ రేవంత్ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రపతిని ఈసీ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఆరుగురు ఎమ్మెల్యేలకు తెరాస సర్కారు పార్లమెంటు సెక్రటరీ పదవులు ఇచ్చిన అంశాన్ని తెరమీదికి తెచ్చారు. నిజానికి, ఆ ఆరుగురి నియామకాలు చెల్లవంటూ గతంలో కోర్టు తేల్చి చెప్పేసింది. ఆ ఆరుగురినీ పదవుల నుంచి తప్పించడం కూడా జరిగిపోయింది. అయితే, అది మాత్రమే చాలదూ ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వారిపై అనర్హత వేటు కూడా వేయాలంటూ టి. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తాజాగా డిమాండ్ చేస్తున్నారు.
ఇదే అంశమై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో గవర్నర్ ను కలుసుకున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు అనర్హులౌతారనీ, వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ నరసింహన్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఈ అంశంపై గవర్నర్ అత్యంత సానుకూలంగా స్పందించారని చెప్పడం విశేషం! తెలంగాణలో చట్ట ఉల్లంఘన జరుగుతోందనీ, ఇచ్చిన ఫిర్యాదును ఈసీకి పంపించాలని, వీళ్లపై అనర్హత వేటు వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. గవర్నర్ స్పందనతో తమకు నమ్మకం ఏర్పడిందన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగమే నడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోవారు తీసుకునే నిర్ణయాలు, నియామకాలు అడ్డగోలుగా ఉంటున్నాయని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు తీరుపై న్యాయ పోరాటానికి వెళ్తామని కూడా చెప్పారు.
ఈ అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పడం ఒకెత్తు అయితే… దీనిపై నరసింహన్ స్పందన సానుకూలంగా ఉందంటూ ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పడం విశేషం! తమ ఫిర్యాదుపై గవర్నర్ చాలా బాగా స్పందించారనీ, చర్యలు తీసుకునే విధంగా చర్యలు ఉంటాయనే నమ్మకం వచ్చిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం కాస్త ప్రత్యేకంగానే ఉంది. ఎందుకంటే, గవర్నర్ తీరుపై కాంగ్రెస్ నేతలు చిర్రుబుర్రులాడుతున్న తరుణమిది. కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారే ఓపక్క విమర్శలు గుప్పిస్తూ… ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆయనకే ఫిర్యాదు చేశారు. మరి, దీనిపై గవర్నర్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.