గవర్నర్ నరసింహన్ ప్రోటోకాల్ ని పక్కనబెట్టి విజయవాడ వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నిన్న సాయంత్రం సమావేశమయ్యి హైకోర్టు విభజన, ఇతర విభజన సమస్యల గురించి చర్చించారు. ఈరోజు ఉదయం ఆయన చంద్రబాబుతో కలిసి వెలగపూడిలో తాత్కాలిక సచివాలయన్ని సందర్శించిన తరువాత మీడియా మాట్లాడారు. చంద్రబాబుతో అన్ని సమస్యల గురించి చర్చించానని, ఆయన చాలా సానుకూలంగా స్పందించారని, చర్చలు ఫలవంతంగా సాగాయని చెప్పారు. హైకోర్టు విభజన గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకి సమాధానంగా ‘నో కామెంట్’ అని సమాధానం చెప్పడం గమనిస్తే ముఖ్యమంత్రితో చర్చల గురించి అయన చెప్పిన మాటలన్నీ పడికట్టు పదాలేనని అర్ధం అవుతోంది. అంటే హైకోర్టు విభజనకి చంద్రబాబు సముఖంగా లేరని స్పష్టం అవుతోంది. లేకుంటే దాని గురించి గవర్నర్ ఒకటి రెండు ముక్కలైనా తప్పకుండా మాట్లాడి ఉండేవారు. కనుక ఈ విషయంలో గవర్నర్ రాయబారం విఫలం అయ్యిందనే భావించవచ్చు.
హైకోర్టు విభజనపై చంద్రబాబు తన వైఖరి ఏమిటో గవర్నర్ కి స్పష్టం చేసే ఉంటారు కనుక ఇప్పుడు బంతి ఆయన కోర్టులోనే ఉందని భావించవచ్చు. హైకోర్టు విభజన కంటే ముందు షెడ్యూల్: 9, 10 సంస్థల విభజన జరగాలని చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. కనుక ఇప్పుడు గవర్నర్ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో దీని గురించి చర్చించి ఒప్పించవలసి ఉంటుంది. హైకోర్టు విభజన ఏవిధంగా అనివార్యమో, ఆ సంస్థల విభజన కూడా అనివార్యమే కనుక తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అందుకు అభ్యంతరం చెప్పలేరు. చెపితే అప్పుడు బంతి కేంద్రప్రభుత్వం కోర్టులో పడుతుంది. అప్పుడు కధ మళ్ళీ మొదటికి వస్తుంది. కనుక ఈ సమస్యని రాష్ట్ర స్థాయిలో పరిష్కరించుకోవడమే విజ్ఞత అనిపించుకొంటుంది. అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరిస్తారో లేదో త్వరలోనే తెలుస్తుంది.