ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నరు నరసింహన్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తనప్రసంగంతో ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల ఉత్సాహం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నల్లకండువాలతో తెలియజెప్పిన నిరసనల మధ్య గవర్నరు తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. సభలో ఎంత యాగీ చేయాలనే ఉద్దేశం, కోరిక లోలోపల రగులుతూ ఉన్నప్పటికీ.. గవర్నరు ను ‘చాలా’ విషయాలకోసం సంప్రదిస్తూ ఉన్న జగన్, ఆయన ప్రసంగానికి అడ్డు తగిలేంత సాహసం చేయకపోవచ్చునని తెలుగు360 ముందుగానే అభిప్రాయ పడింది. దానికి తగినట్లుగానే గవర్నరు ప్రసంగం పట్ల పెద్ద నిరసనలు ప్రదర్శించకుండానే.. అలాగని.. ఖాళీగా విడిచిపెట్టకుండా, వైకాపా సభ్యులు నల్ల కండువాలతో వచ్చారు.
అయితే గవర్నర్ నరసింహన్ ప్రసంగం మాత్రం సామాన్యుడికి రుచికరంగా సాగిపోయింది. తెదేపా సర్కారు చేపట్టదలచుకుంటున్న అనేక సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వెల్లడించారు. ఇవన్నీ అందరికీ ఇష్టపడేవే.
ఒకవైపు విభజన వలన ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని అంటూనే.. కొత్తగా సంక్షేమానికి తలపెట్టిన అనేక అంశాలను గవర్నర్ వెల్లడించారు. రుణమాఫీ, 150కు ప్రతి ఇంటికీ ఫోను, ఇంటర్నెట్ లవంటి వాటిని అందించడం దగ్గరినుంచి సంపూర్ణ అక్షరాస్యత, ్పఎవేటు యూనివర్సిటీలు, నధుల అనుసంధానం లాంటివి అనేకం ఈ ప్రసంగంలు ఏకరవు పెట్టారు. సాధించిన ఘనత పరంగా తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా.. కొన్ని అంశాలను తమ ఖాతాలోకే వేసుకునేలా కూడా కొన్ని అంశాలను చొప్పించారు. కాపులను బీసీల్లో చేర్చడం, కాపు కమిషన్కు 1000కోట్లు లాంటివి, సంక్షేమ హాస్టళ్లు, పోర్డులు, రోడ్ల అభివృద్ధి వంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి.
అందుకే గవర్నరు ప్రసంగం విన్న సామాన్యుడు అనుకుంటున్న మాట ఒక్కటే. ఆయన ప్రసంగం యావత్తూ అరచేతిలో వైకుంఠం చూపించిన చందంగా ఉన్నది. ఆయన ప్రసంగంలోని మాటలు ఈ ఏడాదిలో కార్యరూపం దాలిస్తే అద్భుతాలు జరిగినట్లే. కార్యరూపంలోకి రాకపోతే.. తెలుగుదేశం సర్కారు జనాన్ని గవర్నరు ద్వారా బురిడీ కొట్టించినట్లే!!