ఏపీ ప్రభుత్వం పంపిన చుక్కల భూముల ఆర్డినెన్స్ ను గవర్నర్ నరసింహన్ తిప్పి పంపారు. దరఖాస్తు గడువును కేవలం రెండు నెలలు మాత్రమే నిర్ణయించడంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు వెర్సెస్ గవర్నర్ మధ్య సంబంధాలపై మరోసారి చర్చ తెరమీదికి వచ్చింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత, ముఖ్యమంత్రితో లాంఛనమైన పలకరింపులకు మాత్రమే ఆయన పరిమితమయ్యారని సమాచారం. ఇక, గతంలో కూడా నాలా చట్టానికి సంబంధించీ గవర్నర్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం, అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడం తెలిసిందే. ఇప్పుడీ చుక్కల భూముల ఆర్డినెన్స్ అంశంలో కూడా గతానుభవాలను దృష్టిలో పెట్టుకునే గవర్నర్ స్పందించారా అనే అనుమానం కలుగుతోంది.
ఈ చుక్కల భూముల సమస్య బ్రిటిష్ కాలం నుంచి ఉన్నదే. దీనికి ఇప్పుడైనా పూర్తిస్థాయి పరిష్కారం చూపించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇంతకీ, ఈ చుక్కల భూములు అంటే ఏంటంటే… రెవెన్యూ రికార్డుల్లో కొన్ని భూముల వివరాలకు చట్టబద్ధమైన యజమాని ఎవరనే సమాచారం ఉండదు. అలాంటి వివరాలను స్టార్స్ పెట్టి రికార్డుల్లో నమోదు చేస్తారు. అవే చుక్కల భూములు. కానీ, వీటిలో కొంతమంది వ్యవసాయం చేస్తున్నవారు ఉంటారు. కొన్ని తరాలుగా సాగు చేస్తున్నవారు కూడా ఉంటారు. అయితే, రికార్డుల్లో వీరి వివరాలుండవు.. చుక్కలే ఉంటాయి. ఇలాంటి భూములు ఏపీలో 9 జిల్లాల్లో ఉన్నాయి. వీటన్నింటినీ క్రమబద్ధీకరించాలని, నిజమైన హక్కుదారుడిని గుర్తించాలని ప్రభుత్వం భావించింది. ఈ భూముల్లో ఎక్కువగా సాగు చేస్తున్నవారు సన్న, చిన్నకారు రైతులే. ఆయా భూములను సదరు రైతు ఎన్నాళ్లుగా సాగు చేస్తున్నాడు, వారి వివరాలేంటనేవి తేల్చాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. చాలామంది రైతులకు ఊరట కలుగుతుంది. అందుకే, ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం భావించారు. కానీ, గవర్నర్ తిప్పి పంపారు.
ఇప్పుడు దీన్ని అసెంబ్లీలో ఆమోదించి, గవర్నర్ కు పంపాలని ప్రభుత్వం అనుకుంటోంది. సభ ఆమోదం పొందిన తరువాత గవర్నర్ అభ్యంతరం తెలిపే అవకాశం ఉండదని టీడీపీ అభిప్రాయపడుతోంది. ఇది రైతులకు సంబంధించిన వ్యవహారమనీ, దీన్ని రాజకీయ కోణంగా చూడకూడదనే అభిప్రాయం కూడా అధికార పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. గవర్నర్ తిప్పి పంపడాన్ని కొంత రాజకీయంగా కూడా చూడాల్సిన పరిస్థితే ఉందనీ అంటున్నారు! నిజానికి, ఇదేదో ఎన్నికల హడావుడి కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. గత రెండేళ్లుగా చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో అధికారుల స్థాయి నుంచి నిర్లక్ష్య వైఖరి కూడా కనిపించింది. దీంతో ఆర్డినెన్స్ తెద్దామని ప్రభుత్వం అనుకుంది. ఇప్పుడు ఆలస్యమైనా సరే… చట్టం చేసేద్దామని నిర్ణయించుకుంది.