తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఎట్ హోం విందు కర్యక్రమానికి గైర్హాజర్ అయ్యారు. మామూలుగా అయితే .. ఇది మామూలే కదా అనుకునేవారు. కానీ కేసీఆర్ వస్తున్నట్లుగా రాజ్ భవన్‌కు సమాచారం పంపారు. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత కూడా ఆయన రాలేదు. ఇరవై నిమిషాల సేపు ఆయన కోసం వేచి ఉన్న తరవాత కేసీఆర్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందన్న సమాచారం రాజ్ భవన్‌కు వచ్చింది. అతిధులంతా ఉసూరుమనాల్సి వచ్చింది.
ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వంటి వేడుకల సమయంలో రాజ్ భవన్లో ‘ఎట్ హోమ్’ పేరుతో చిన్నపాటి విందు గవర్నర్ ఇస్తూంటారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్తుంది. అందరూ పాల్గొంటూ ఉంటారు. గవర్నర్‌తో అభిప్రాయభేదాలు ఉన్నా.. ఇలాంటి సందర్భంలో పట్టించుకోరు. అయితే గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా కేసీఆర్ గవర్నర్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. రాజ్ భవన్ వైపు వెళ్లడం మానేశారు. గవర్నర్‌కు ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదు. దీంతో ఈ అంశం మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది.
అయితే వస్తానని చెప్పి రాకపోవడం.. అసలు ప్రోగ్రాం ప్రారంభాన్ని వాయిదా వేసినా సరే.. ఇరవై నిమిషాల తర్వాత రావడం లేదని చెప్పడం.. రాజ్‌భవన్‌ను అవమానించినట్లు ఉందన్న అభిప్రాయంవినిపిస్తోంది. ఇటీవల రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఇటీవల రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. అప్పట్లో పరిస్థితి సద్దుమణిగిందనుకున్నారు. కానీ ఎలాంటి మార్పు లేదని.. తనకు ప్రోటోకాల్ అందడం లేదని గవర్నర్ ఇటీవల ఆరోపణలు చేశారు. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించినప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించే వ్యాఖ్యలే చేశారు. ఈ కారణాలతో కేసీఆర్ దూరంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే దూరంగా ఉండాలనుకుంటే ముందుగానే సమాచారం ఇస్తారని.. అవమానించాలనుకున్నారు కాబట్టే వస్తానని చెప్పి రాలేదన్న వాదన వినిపిస్తోంది.