చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే .. విడదల రజని మంత్రిగా ఉండి చేసి అవినీతి, అక్రమాల విషయంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి కావడం.. పదవిలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై కేసులు పెట్టడం వల్ల సెక్షన్ 17A కింద గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇప్పటికే అన్ని ఆధారాలు ఉండటంతో కేసు నమోదుకు ఏసీబీ సీఎస్ అనుమతి తీసుకుంది. ఇప్పుడు గవర్నర్ కు కూడా అనుమతి కోసం లేఖ సమర్పించారు. విడదల రజని పై చేసిన ప్రాథమిక దర్యాప్తు, ఆధారాలను కూడా రాజ్ భవన్‌కు ఏసీబీ సమర్పించినట్లుగా తెలుస్తోంది.
విడదల రజని ఎమ్మెల్యేగానే కాదు.. మంత్రి అయిన తర్వాత చెలరేగిపోయారు. నియోజకవర్గంలో ఎవర్నీ వదలకుండా డబ్బులు వసూలు చేశారు. స్టోన్ క్రషర్ల యజమానుల దగ్గర అయితే కోట్లకు కోట్లు వసూలు చేశారు. ఓ స్టోన్ క్రషర్ యజమానికి యాభై కోట్లు ఫైన్ వేసి.. ఐదు కోట్లు కడితేనే వ్యాపారం చేయగలరని బెదిరించారు. పోలీసుల్ని పంపి హెచ్చరించారు. చివరికి రెండున్నర కోట్లకు బేరం కుదుర్చున్నారు. ఇలా వందల మంది దగ్గర వసూలు చేయడంతో వైసీపీ ఓడిపోవడంతోటే వారందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు అంశాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణలు జరిపి.. డబ్బులు ఎవరు వసూలు చేశారు.. ఎవరి ఖాతాలోకి వెళ్లాయో కూడా తెలుసుకున్నారు.
గవర్నర్ అనుమతి రాగానే విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసి .. అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చిలుకలూరిపేటలో ఆమె చేసిన అక్రమాల కారణంగా ఓడిపోవడం ఖాయమన్న కారణంగా గుంటూరు నుంచి పోటీ చేయించారు. అక్కడా ఆమె అత్యంత ఘోరంగా ఓడిపోయారు. మళ్లీ చిలుకలూరిపేటకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేసి .. చాలెంజ్‌లు చేసి అంతు చూస్తామంటున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన అక్రమాలపై కేసులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.