గవర్నర్ నరసింహన్‌పై తెలుగుదేశం నాయకులు ఎప్పటికప్పుడు ఏవో విమర్శలూ ఆరోపణలూ చేస్తూనే వున్నారు. ఒక దశలోనైతే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు గనక తొలగించాలని కోరేవారు. విచిత్రంగా అప్పట్లో బిజెపి నేతలు కొందరు అందుకు వంతపాడారు. ఇటీవలి కాలంలో గవర్నర్‌పై టిడిపి విమర్శల తీరు మారింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనతో కలసి రాజకీయాలు నడుపుతున్నారనేది వారి తాజా ఆరోపణ. వైసీపీ నాయకులు సరే ప్రధాని మోడీని కలిశారు గనక మీరు ఆరోపణలు చేయొచ్చు. గాని పవన్‌కు సంబంధించి అలాటివి ఏమీ ఆధారాలు లేవు గదా అన్నప్పుడు గవర్నర్‌తో మంతనాలు జరపుతున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. అయితే ఎట్హౌంలో ఉభయ ముఖ్యమంత్రుల సమక్షంలో తప్ప మరోసారి పవన్ గవర్నర్‌ను కలిసిందే లేదన్నది జనసేన నేతల వివరణ. వారిద్దరూ కలిసి మాట్టాడినట్టు నిరూపించగలరా అని సవాలు విసురుతున్నారు. ఈ సవాలు స్వీకరించలేని టిడిపి నేతలు గవర్నర్ ఫోన్లో పవన్‌తో మాట్లాడుతున్నట్టు ఆధారాలు వున్నాయని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. మరి వారి ఫోన్లపై నిఘా వేస్తున్నారా అనే ప్రశ్న ఒకటైతే కాల్‌డేటాను బట్టి ఆరోపణలు చేయడం సమంజసమా అనే ప్రశ్న జనసేన వేస్తున్నది. కాల్‌డేటా కారణంగానే చంద్రబాబు నాయుడు ఆఘమేఘాల మీద హైదరాబాద్ నుంచి పలాయనం పాడారని వారు గుర్తు చేస్తున్నారు.
గవర్నర్లు ఎవరైనా ఎప్పుడైనా కేంద్రం నియమిస్తేనే ఇక్కడకు వస్తారు. ఎప్పటికప్పుడు వివరమైన నివేదికలు పంపిస్తుంటారు. పాలనా వ్యవహారాలపైనే గాక రాజకీయాలపైన కూడా ఈ నివేదికలు వెళుతుంటాయి.ఆ క్రమంలో గవర్నర్ నరసింహన్ జనసేన కార్యకలాపాల గురించి కూడా నివేదిక పంపడం, ఆ విషయాలు ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరితో మాట్లాడి తెలుసుకోవడం టిడిపి అనుమానాలకు కారణమైనట్టు చెబుతున్నారు. కాని రాజ్యాంగ పరంగా ఈ ప్రక్రియను ఎవరూ చేయగలిగింది లేదు. పైగాగవర్నర్ ఏ పార్టీ వారినైనా అధికారికంగా కలుసుకోవచ్చు.మెమోరాండాలు ఆరోపణలు తీసుకోవచ్చు. కనుక పవన్ తో మాట్లాడారనే ఒక్క ఆరోపణతో అభాండాలు వేయడం తప్పని జనసేన ప్రతినిధులు గట్టిగా ఖండిస్తున్నారు. అయితే టిడిపి వారు మాత్రం తమ ఆరోపణలు ఆపే పరిస్థితి కనిపించడం లేదు.