కేంద్రం ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడమే ఒక మిథ్య కాగా దాన్ని ఇంకా కీర్తించేపనిలో రాష్ట్ర ప్రభుత్వం మునిగితేలుతున్నది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాటల్లో గాని, బడ్జెట్ ప్రసంగంలో గాని ఎక్కడా ప్యాకేజీ అన్న పదమే వాడింది లేదు. ప్రత్యేక సహాయం అని మాత్రమే అన్నారు. దానికి చట్టబద్దత కావాలని తెలుగుదేశం హడావుడి చేస్తే అదేమీ వుండదన్నారు. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలోనూ దాన్ని టేబుల్ ఎజెండాగా పెట్టి తీసేశారు. అయినా సరే నూతన రాజధాని అమరావతిలో శాసనసభ తొలి సమావేశాలలో గవర్నర్ ఇఎల్ నరసింహన్ చేసిన ప్రసంగంలో ప్యాకేజీని స్తుతిగీతాలాలపించారు. పైగా ప్రత్యేక హౌదావల్ల లభించే సదుపాయాలన్నీ ప్యాకేజీ వల్లకూడా వస్తాయన్నారు. అసలు హౌదా వ్యర్థం అని ఒకవైపున వాదిస్తూ దానివల్ల కలిగేవన్నీ దీనిద్వారా వస్తాయని వాదించడమేమిటి? కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోవడం ఒకటైతే లేని మిథ్యా ప్యాకేజీని పదే పదే కీర్తించడం ఇంకా దారుణంగా వుంది. ఇక పోలవరంకు జాతీయ హౌదా కల్పించినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పేశారు. అవేమైనా చెబితే మన్మోహన్సింగ్ సర్కారుకు కదా చెప్పాలి? వారు చెప్పిన వాటిలో అమలు చేయని వాటికి చట్టంలో పెట్టకపోవడం కారణమంటారు. చట్టంలో పెట్టినవి చేసినప్పుడేమో వెంకయ్య నాయడు ఘనత అంటారు. ఇదంతా వింత విపరీత తర్కంలా లేదూ? మంచినీటి కొరతతో సహా అనేక సమస్యలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయి.నిధుల కొరత వెన్నాడుతున్నది. అవన్నీ విస్మరించి అంతా బాగుందని అతిశయోక్తులు చెప్పుకుంటే ఎవరికి మేలు? కరువు నివారణ, ఉపాధి కల్పన, ఆర్థిక వనరుల పెంపు, వంటి కీలక సమస్యలు వదిలేసి కేంద్ర రాష్ట్రాలకు కితాబులిచ్చుకోవడానికి పరిమితమైతే ఏం లాభం?