వ్యూహరచనా చతురుడు..పథకాలు పారించుకోవడంలో నిష్ణాతుడు.. ఎంతటి సమస్యనుంచైనా ఇట్టే గట్టెక్కగల సమర్థుడూ..అన్నింటి అర్థాలూ ఇంచుమించుగా ఒకటే. వాటికి పర్యాయపదం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయినా కూడా క్యాబినెట్ విస్తరణ ఆయనకు కొరకరానికొయ్యయి కూర్చుంది. మంత్రి పదవులు ఎరచూపి, ఇతరత్రా ప్రలోభ పెట్టి తమవైపు తిప్పుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ముగ్గురికి మంత్రిపదవులు దక్కుతాయనుకుంటున్నారు. విడతలవారీగా అయినా వీరంతా అధికారపక్ష తీర్థం సేవించి, ఆర్నెల్లు దాటింది. ఇంతవరకూ మంత్రివర్గ విస్తరణే లేదు. ఒక్కపక్క వారిలో అసహనం పెరిగిపోతోంది. చినబాబు లోకేశ్‌కూ మంత్రిపదవి కట్టబెట్టాలనే డిమాండ్లు ఇటు పార్టీలోనూ, అటు ఇంట్లోనూ కూడా ఊపందుకుంటున్నాయని తెలుస్తోంది. లోకేశ్‌ను మంత్రిగా చూడాలంటే విస్తరణ తప్పనిసరి. ఎవర్నీ తీసుకోకుండా లోకేశ్‌ను మాత్రమే తీసుకుంటే బంధుప్రీతి చూపారనే ఆరోపణ తోడవుతుంది. ఇందుకోసమైనా కొత్తముఖాలకు చోటివ్వాలి. నెగ్గిన పార్టీకి శఠగోపం పెట్టి వచ్చిన వారిని కాదని తన పార్టీవారికే విస్తరణను సరిపెడితే ఏ ఉపద్రవమొస్తుందో…
వీటన్నింటినీ మించిన అభ్యంతరం గవర్నర్ నుంచి ఎదురవుతోందనేది ఓ వాదన. ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాదిరిగా తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరి, మంత్రి పదవి పొందిన టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించినందుకు గవర్నర్‌ను టీటీడీపీ ఇప్పటికీ ఆడిపోసుకుంటోంది. తెలంగాణ టీడీపీ అసెంబ్లీ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, పార్టీ కోర్టుకెళ్ళడంతో అది పెండింగ్‌లో పడింది. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఈ అంశంపై గవర్నర్‌పై ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అదే తప్పు మళ్ళీ చేస్తే, ఆంధ్రలోనూ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే చంద్రబాబు తన క్యాబినెట్ విస్తరణ ప్రయత్నాన్ని రెండు సార్లు వాయిదా వేసుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, జలీల్‌ఖాన్‌కు మంత్రిపదవులు కట్టబెట్టాలని భావిస్తున్నారు. ఈ పేర్లపైనే గవర్నర్ అభ్యంతరం వ్యక్తంచేశారంటున్నారు. ముందు వారిచేత రాజీనామా చేయించి, గెలిపించుకోండి.. అప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోండని ముఖ్యమంత్రికి సూచిస్తున్నట్లు భోగట్టా. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళికి క్యాబినెట్‌ను విస్తరించేసుకోవాలన్న చంద్రబాబు ఆకాంక్ష నెరవేరేలా కనిపించడం లేదు. వేరే పేర్లు సూచిస్తే తప్ప అది కష్టసాధ్యమనే భావించవచ్చు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా తామరాకుపై నీటిబొట్టులా వ్యవహరిస్తూ గవర్నర్ నరసింహన్ పనిచేసుకుంటూ పోతున్నారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్న చందంగా బాబొకటి తలిస్తే గవర్నర్ ఒకటనుకుంటన్నారు. క్యాబినెట్ విస్తరణ అవుతుందా లేదా అన్న అంశంపై చంద్రబాబు ఈపాటికే ఒక నిర్ణయానికి వచ్చేసుండాలి. కాకపోతే, పాలనాదక్షుడైన ఆయన తన ఓటమిని అంత తొందరగా అంగీకరిస్తారన్న నమ్మకం లేదు. ఏదైనా పాచిక విసిరి గట్టెక్కడానికి అక్కడ ఆయనకు అడ్డున్నది గవర్నర్.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి