హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ అసలే పరమభక్తుడు. వీలు దొరికితే చాలు తిరుమల వెళ్ళి దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక మహా పుష్కరాలకు హాజరవకుండా ఉంటారా! అయితే రెండు రాష్ట్రాలలో ఒకచోటికి వెళితే మరొకరిని నొప్పించినట్లువుతుందనుకున్నారో, ఏమో! పుష్కరస్నానంలో సమన్యాయం ప్రదర్శించారు. ఇరు రాష్ట్రాలలోనూ గోదావరిలో పుష్కరస్నానమాచరించారు. ఉదయం హైదరాబాద్‌నుంచి సతీసమేతంగా మొదట రాజమండ్రి వెళ్ళి సరస్వతి ఘాట్‌లో స్నానం చేశారు. తర్వాత వసతిగృహానికి వెళ్ళి బట్టలుమార్చుకున్నారు. సింగపూర్ బృందంతో బిజీగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చి ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్‌ను పలకరించారు. తర్వాత గవర్నర్ అక్కడనుంచి హెలికాప్టర్లో ఖమ్మంజిల్లాలోని భద్రాచలంవెళ్ళి సమీపంలోని మోతే పుష్కరఘాట్లోకూడా స్నానమాచరించారు. భద్రాచలం రామాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకున్నారు.