తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో భేటీ అయ్యారు. కేంద్రంపై పోరాటం నేపథ్యంలో మూడు రోజుల కిందటే ధర్మ పోరాట దీక్ష చేశారు సీఎం. ఆ తరువాత, గవర్నర్ వచ్చి ఆయన్ని కలవడం ఆసక్తికరంగా మారింది. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే రాష్ట్రానికి మంచిదనీ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు బాగుంటేనే ప్రజలకు మంచిదని ఈ సందర్భంగా సీఎంతో గవర్నర్ అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం నాలుగేళ్లు ఎదురుచూశామనీ, చివరి బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి న్యాయం జరగలేదనీ, అందుకే మాట్లాడాల్సి వస్తోందని చంద్రబాబు బదులిచ్చారు.
తానేమీ రాజకీయాలు మాట్లాడటం లేదనీ, భాజపాపై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ఆగ్రహావేశాలూ లేవన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ నెరవేర్చి, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను పూర్తి చేస్తే కేంద్రంతో తమకు ఎలాంటి సమస్యా ఉండదనీ, అయితే కేంద్రం ఆపని చేసే వరకూ తన పోరాటం తప్పదనీ, ఈ విషయంలో రాజీ ఉండదని గవర్నర్ కు చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడలేదు. గవర్నర్ మాట్లాడుతూ… ఇది పాత మిత్రుల సమావేశమే తప్ప, దీనికి అంతకుమించి ప్రత్యేక ప్రాధాన్యత ఏదీ లేదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణాన్ని చల్లబరచాలనే ప్రయత్నంలో భాగమే గవర్నర్ భేటీ అని చెప్పుకోవచ్చు. అయితే, రాష్ట్ర ప్రయోజనాల సాధన విషయమై ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంలో స్పందించాల్సింది కేంద్రమే. పట్టువిడుపు ధోరణి ఉండాల్సింది వారికే. ఎన్డీయేకి దూరమైన దగ్గర నుంచీ టీడీపీనీ, ఏపీనీ శత్రుభావంతో కేంద్రం చూస్తోంది. చంద్రబాబును కలిసిన గవర్నర్.. కేంద్రంతో కూడా రాష్ట్ర తరఫు వాదన వినిపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రాజకీయం చేయడం కోసం భాజపాతో వైరం పెట్టుకోలేదని సీఎం అంటున్నారు. కానీ, ఏపీ విషయంలో భాజపా చేస్తున్నది ఫక్తు రాజకీయమే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలతో కూడా నరసింహన్ మాట్లాడితే… ఈ రాజీయత్నం పరిపూర్ణం అవుతుంది. ఫలితం ఆశించే పరిస్థితులు లేవుగానీ… కనీసం ఒక ప్రయత్నమైనా జరుగుతోంది కదా!