ఓ వైపు కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ.. మరో వైపు గవర్నర్ కూడా.. కోర్టు తీర్పును అమలు చేయాలని ఆదేశించారు. ఇలాంటి సమయంలో… ప్రభుత్వం మొండిపట్టుదలకు పోతోంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎస్ఈసీగా నియమించే విషయంలో… ఏ మాత్రం… తన విధానంపై వెనుకడుగు వేయకూడదని భావిస్తోంది. దీంతో ఉన్నతాధికారుల్లో వణుకు ప్రారంభమయింది. ముఖ్యంగా.. కోర్టు ధిక్కరణ ఏం జరిగినా… అది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెడకు చుట్టుకుంటుంది. నిబంధనల ప్రకారం.. నడుచుకోవాల్సినా.. కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే. దీంతో ఇప్పుడు.. నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చిక్కుల్లో పడినట్లయింది.
రాజ్‌భవన్ నుంచి… నిమ్మగడ్డ నియామకం ఆదేశాలు నేరుగా.. చీఫ్ సెక్రటరీకి వచ్చాయి. మామూలుగా నియామక ఆదేశాలు తయారు చేసి.. గవర్నర్‌కు పంపితే.. ఆయన సంతకం చేస్తారు. కానీ ఇక్కడ.. అలాంటి పరిస్థితి లేదు. చీఫ్ సెక్రటరీ ఎలాంటి ఆదేశాలను తయారు చేసే పరిస్థితి లేదు. అలాగని.. సైలెంట్‌గా ఉంటే… కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని.. రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆదేశాలను నేరుగా.. ముఖ్యమంత్రి కార్యాలయానికి.. అంటే సీఎంవోకు పంపేశారు. రేపు ఏం జరిగినా.. తనకు సంబంధం లేదని… మొత్తం సీఎంవోనే చూసుకుందని.. చెప్పుకోవడానికి ఆమెకు అవకాశం చిక్కినట్లయింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని ఉన్నప్పటికీ…, మొత్తంగా వ్యవహారాలన్నీ సీఎంవో నుంచే నడుస్తున్నాయి. అక్కడ ప్రవీణ్ ప్రకాష్ తిరుగులేని అధికారిగా ఉన్నారు. అన్నీ ఆయన చేతుల మీదుగానే నడుస్తున్నాయి. చేస్తున్నదంతా ఆయన అయితే.. ఇతర అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పుడు.. చీఫ్ సెక్రటరీ.. కొత్త ప్లాన్ ప్రకారం.. ఇక ఎలాంటి కోర్టు ధిక్కరణలు అయినా నేరుగా సీఎంవోనే భరించాల్సి ఉంటుందనే అభిప్రాయం ప్రారంభమయింది. కోర్టు తీర్పులను ఉల్లంఘించి.. గవర్నర్ ఆదేశాలనూ పట్టించుకోని పరిస్థితి వస్తే అది రాజ్యాంగసంక్షోభమే అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందనేది అంచనా వేయడం కష్టమే.
శుక్రవారం.. సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై స్టే పిటిషన్‌పై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు స్పందనను బట్టి నిర్ణయం తీసుకోవాలని సీఎంవో భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు నిమ్మగడ్డను పునర్నియమించాలన్న హైకోర్టు తీర్పపై స్టే ఇవ్వడానికి మూడు సార్లు నిరాకరించింది. ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నట్లయింది. ఒక వేళ.. స్టే ఇచ్చినా అది నిమ్మగడ్డ నియామకంపై ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకం కాదు. అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం.. వెనక్కి తగ్గకూడదని.. తెగె వరకూ లాగాలని అనుకుంటోంది.