ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరో కీలకమైన పదవి దక్కబోతుందా..? ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరిని రాజ్యాంగబద్దమైన పదవి వరించబోతుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఎన్డీయే కూటమిలోని టీడీపీకి అన్నింటా ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రివర్గంలో ఓ కేబినెట్ మంత్రితోపాటు సహాయ మంత్రి పదవి ఇచ్చింది. ఈ క్రమంలోనే టీడీపీకి ఓ గవర్నర్ పదవి కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర పెద్దల నుంచి చంద్రబాబుకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్ల పదవికాలం ముగియనుండటంతో కొత్త గవర్నర్ లను నియమించాల్సి ఉంది. ఈ క్రమంలోనే టీడీపీకి ఓ గవర్నర్ పదవి ఇవ్వాలని భావించి ఒకరి పేరును సూచించాలని చంద్రబాబును కేంద్ర పెద్దలు కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఎవరి పేరును సూచించనున్నారు..? అనేది ఆసక్తికరంగా మారింది.
2014లోనూ టీడీపీ ఎన్డీయే కూటమిలో ఉన్నది. అప్పట్లోనే ఆ పార్టీకి గవర్నర్ పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ రాజకీయ పరిస్థితుల రీత్యా ఎన్డీయే కూటమి నుంచి వైదొలడంతో టీడీపీకి గవర్నర్ పదవి దక్కలేదు. ఇప్పుడు ఎన్డీయేలో రెండో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి గవర్నర్ పోస్ట్ కేటాయించే అవకాశం ఉంది.
గవర్నర్ పదవికి సీనియర్లు, అనుభవజ్ఞులను ఎంపిక చేస్తారు. దాంతో ఈ పదవికి టీడీపీ నుంచి మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఫైనల్ చేసే అవకాశం ఉంది.
https://youtu.be/bqRs7__00xx5nc