హనుమాన్ జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రేనని ప్రకటించేసుకున్న టీటీడీ… ఇప్పుడు అనూహ్యంగా ఆంజనేయుని జయంతిని కూడా జూన్ నాలుగో తేదీన ఖరారు చేసి నిర్వహించేసింది. దీనిపై హంపి కిష్కింధ ట్రస్ట్ … ట్రస్టీ గోవిందానంద చార్య మరోసారి టీటీడీపై విరుచుకుపడ్డారు. కొద్ది రోజుల నుంచి టీటీడీ జన్మస్థలంపై అటో ఇటో తేల్చుకోవాలనుకున్న ఉద్దేశంతో తిరుపతిలోనే మకాం వేసిన ఆయన తాజాగా.. హనుమాన్ జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహించడంపై మండిపడ్డారు. టీటీడీ హనుమంతుడి జయంతి వ్యవహారం హాస్య ధారావాహికంలా ఉందని… హనుమంతుడిపై టీటీడీ ప్రచురించిన పుస్తకం లో ఇచ్చిన జయంతికి, ఇప్పుడు నిర్వహిస్తున్న తేదీలకు పొంతన లేదని లెక్కలు చూపించారు.
టీటీడీ చెప్పినట్టు శ్రావణ మాసం అంటే జులైలో జయంతి జరగాలని.. కానీ జూన్‌లోనే చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీటీడీ పండితులు, వీసీ లు హనుమంతుడికి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్లు దీనికి సమాధానం చెప్పాలన్నారు. హనుమంతుడి జన్మస్థలంపై ఇంగ్లిష్‌లో బుక్ ప్రచురిస్తే.. టీటీడీ గుట్టు అందరికీ తెలిసిపోతుందన్నారు. హనుమాన్ జయంతిని దేశ వ్యాప్తంగా చైత్ర మాసంలో అంటే మార్చిలో చేస్తారని.. టీటీడీ సత్యాన్ని చెప్పకుండా అబద్ధాల పైన అబద్దాలు చెపుతోందని విమర్శించారు. ఇంతకు ముందు జపాలి తీర్థంలో పుట్టాడని .. ఇప్పుడు ఆకాశగంగలో పుట్టాడని అంటున్నారని.. ఇలా క్షణానికి ఒక మాట టీటీడీ చెప్పటం తగదనన్నారు. ఇప్పటికైనా శంకర, మద్వ, రామానుజ పెద్దలను టీటీడీ వెంటనే సంప్రదించాలని సూచించారు.
తను టీటీడీ పుస్తకాన్ని అంగీకరించినట్లుగా విశాఖ శారదా పీఠం ప్రచారం చేయడంపై మండిపడ్డారు.. ఆ పీఠం డూప్లీకేట్ పీఠమని.. శంకరాచార్యులు పెట్టిన శృంగేరి, బద్రి, పూరి, ద్వారక ఈ నాలుగుపీఠాలు, కంచి పీఠం మాత్రమే శంకర పీఠాలని స్పష్టం చేశారు. ఏ ఉద్దేశంతో శ్రీవారి కన్నా ఎక్కువగా ఆంజనేయుడికి ప్రచారం కల్పించాలని టీటీడీ ప్రయత్నిస్తుందో కానీ.. అది వివాదాస్పదం అవుతోంది. కిష్కింధ ట్రస్ట్ తాడో పేడో తేల్చుకోవాలనుకుంటోంది. ఇక గోవిందానందను టీటీడీ పట్టించుకోదని ఈవో జవహర్ రెడ్డి తేల్చేసారు.