వరద వెల్లువెత్తింది. తగ్గింది. కానీ ఆ వరద బారిన పడిన ప్రజలు మాత్రం జీవితాన్ని కోల్పోయారు, కట్టుబట్టలతో మిగిలిపోయారు. చివరికి గూడు కూడా మిగలని కుటుంబాలు ఎన్నో. నెల్లూరు, తిరుపతి ముఖ్యంగా కడప జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లోని పరిస్థితి చూస్తే గుండె చెరువైపోతుంది. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో మెరుగుపడక .. పూర్తి సమాచారం బయటకు రావడం లేదు. కానీ అక్కడి ప్రజల కన్నీరు కూడా ఇంకిపోయాయి. మంచి నీరు దొరక్క మురికినీళ్లతోనే కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి. ఆకలితో అలమటిస్తున్నారు. ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంటే హుటహుటిన స్పందించాల్సిన అధికార యంత్రాంగం.. జరిగేదేదో జరుగుతుందన్నట్లుగా ఉంది.
వరద పరిస్థితిపై మూడు రోజుల ముందుగానే అంచనాలు ఉన్నాప్పటికీ జాగ్రత్తలు తీసకోలేదు. విరుచుకుపడిన తర్వాత కూడా అదే పరిస్థితి. అంతా అయిపోయిన తర్వాత కూడా అదే. పోయిన ప్రాణాలు పోగా .. ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్న వారికి ఆకలిదప్పులు తీర్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. స్వచ్చంద సంస్థలు చేస్తున్న అరకొర సాయమే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం వైపు నుంచి పునరావాస శిబిరాలే అతి తక్కువగా ఉంటే.. అందులోకి తరలించుకు వచ్చిన వారు ఇంకా తక్కువ.
అనేక చోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉండటం ఏమిటన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ప్రభుత్వంలోని పై స్థాయి వాళ్లే పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో కింది స్థాయి అధికార యంత్రాగం కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వరద వస్తుంది… పోతుంది అన్న పద్దతిలో ఫిక్సయిపోయారు. అలాగే వచ్చింది.. పోయింది.. కానీ తుడిచిపెట్టుకుపోయిన జీవితాల గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు.
ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వాల స్పందన వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకూ అఘామేఘాల మీద ప్రజా జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రభుత్వాలను చూశాం కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా.., జరగాల్సింది జరుగుతుందన్నట్లుగా చూసే ప్రభుత్వాలను మాత్రం ప్రజలు ఇప్పుడే చూస్తున్నారు.