నల్లబంగారు సిరుల సింగరేణి కాలరీస్ సంస్థలో వారసత్వ ఉద్యోగాలకు యాజమాన్యం పచ్చజెండా ఊపింది. ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన హామీ ఇప్పటికి అమలు కాబోతుంది. దీంతో సింగరేణిలో చాలా మంది సంబరాలు చేసుకున్నారు.
గనుల్లో దిగి బొగ్గు ఉత్పత్తి చేసే కార్మికుల పని చాలా శారీరక శ్రమతో కూడుకున్నది. కాబట్టి
రిటైర్మెంట్ వయసు వచ్చే వరకూ ఫిట్ నెస్ ఉండటం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల పద్ధతి అమల్లో ఉండేది. కానీ 2002లో చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. దీన్ని పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు చాలా కాలం పోరాడినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే వారసత్వ ఉద్యోగాలను తిరిగి ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.
ముఖ్యమంత్రి సూచన మేరకు సింగరేణి బోర్డు పలు దఫాలుగా ఈ అంశంపై చర్చించింది. చివరకు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం గత నెల 11 నాటికి 48 నుంచి 59 ఏళ్ల వయసు గల కార్మికులు తమ వారసులకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కార్మికుడి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుకోసం కార్మికులు రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించారని తెలియగానే పలుచోట్ల టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.