హైదరాబాద్: రాజమండ్రి నగరం మొత్తం పండగ వాతావరణం సంతరించుకుంది. పుష్కరాలు అధికారికంగా రేపటినుంచి ప్రారంభంకానున్నప్పటికీ ఇప్పటికే భక్తులు పెద్దసంఖ్యలో రాజమండ్రికి వచ్చి నదీస్నానాలు, పుణ్యక్రతువులు నిర్వహించుకుంటున్నారు. పుష్కరాలకోసం ప్రభుత్వం నగరాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దటంతో కొత్తశోభ వచ్చింది. ఇక రాత్రిపూటయితే ప్రభుత్వం ఏర్పాటుచేసిన విద్యుద్దీపాలంకరణతో నగరం ధగధగా మెరిసిపోతోంది. తిరుపతిసహా రాష్ట్రంలోని 13 ప్రధాన ఆలయాల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. పుష్కర యాత్రికులకోసం ప్రభుత్వం హెలికాప్టర్ టూర్లనుకూడా ఏర్పాటు చేసింది. రు.2,000 టికెట్‌తో పదినిమిషాలపాటు నగరంలోని అన్ని పుష్కర ఘాట్లనూ ఆకాశమార్గాన వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కీరవాణివంటి విద్వాంసులు భక్తులను అలరించనున్నారు. గోదావరి జిల్లాల పిండివంటలతో మెగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న శోభాయాత్ర ఇవాళ్టినుంచి ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో ఏర్పాటుచేసిన నమూనా దేవాలయాల ప్రదర్శనను ప్రారంభిస్తారు. అనంతరం పుష్కర ఘాట్ చేరుకుని జానపద కళాకారుల ప్రదర్శనను తిలకిస్తారు. క్రీడాకారులు తీసుకొచ్చిన అఖండ స్వాగత జ్యోతిని అందుకుంటారు. మరోవైపు పుష్కరయాత్రికులకు ఆర్టీసీ బస్సుల్లో సర్‌ఛార్జి వసూలుచేసే ప్రతిపాదనను హిందూమత గురువులు, స్వామీజీలు విమర్శిస్తుండటంతో ఆ ప్రతిపాదనను చంద్రబాబు రద్దు చేశారు.