తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అత్యంత సన్నిహితుడని.. తెచ్చుకున్న పేరును.. స్వరూపానంద.. కాసుల కోసం వాడేసుకుంటున్నారు. అదీ కూడా.. నేరుగా.. ప్రభుత్వాల ద్వారా నేరుగా.. సూచనలు పంపి.. విరాళాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. జనవరి 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు విశాఖ శారదా పీఠంలో హిందూ ధర్మపరిరక్షణ జాతీయ మహాసభలు నిర్వహించాలని నిర్ణయించారు. నెలరోజులపాటు సాగే ఈ కార్యక్రమ నిర్వహణకు సాయం చేయాలంటూ శారదాపీఠం నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు వెళ్లాయి.
ఏపీ ప్రభుత్వం అదే మహాప్రసాదంగా భావించి.. భారీగా ఆదాయం ఉన్న ఆలయాలు తిరుమల, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం దేవస్థానాల ఈవోలకు లేఖలు పంపారు. అందులో నేరుగా ఇవ్వాలని చెప్పలేదు. కానీ ఇవ్వకుండా.. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. అక్కడి అధికారులకు.. ఆలయ పాలక వర్గాలకు తెలుసు. భక్తులు ఇచ్చే కానుకల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా ఆలయాల అవసరాలకు వాడుకోవాలి. ఎలాంటి ధార్మిక కార్యక్రమాలనైనా దేవస్థానమే నిర్వహించాలి. ఒక పీఠం నిర్వహించే సొంత కార్యక్రమానికి దేవుడి డబ్బులు ఇవ్వకూడదు. తెలంగాణ సర్కార్ స్వరూపానంద రాసిన లేఖను ఏం చేసిందో క్లారిటీ లేదు. కానీ కేసీఆర్కు స్వరూపానందపై ఉన్న భక్తి చూసిన.. తెలిసిన వారికి.. ఎంతో కొంత సాయం వస్తుందని చెబుతున్నారు.
తన పీఠంలో జరిగే కార్యక్రమానికి నిధుల వసూలుపై శారదా పీఠం విచిత్రమైన వాదన వినిపిస్తోంది. ప్రతి ఏటా ఈ సభల నిర్వహణ బాధ్యతను భక్తులే చూసుకుంటున్నారని… అందుకే.. ఈ సారి కూడా.. వారికే అవకాశం ఇచ్చామని చెప్పుకొస్తున్నారు. సెక్షన్ 72 ప్రకారం దేవాదాయశాఖ పరిధిలో ఉండే వెసులుబాటు ఆధారంగానే.. శాస్త్ర సభలకు సహకరించాలని అధికారులను కోరామని అంటున్నారు.