ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 90 వేల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ. ఎనిమిది వందల కోట్లు మాయం అయిన ఘటన కలకలం రేపుతోంది. ఆన్ లైన్ ఫ్రాడ్‌కు పాల్పడ్డారని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. అయితే అంత కంగారు పడాల్సిందేమీ లేదని త్వరలోనే వారి ఖాతాల్లో ఆ సొమ్ము జమ అవుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు ఉండేది ప్రభుత్వ పీడీ అకౌంట్లలోనే నేరుగా బ్యాంకుల్లో కాదు ఈ కారణంగా నైజీరియా మోసగాళ్లు తమ ఖాతాలకు మళ్లించుకునే చాన్స్ లేదు. అలా మళ్లించుకునే చాన్స్ ప్రభుత్వానికే ఉంది. ప్రభుత్వమే మళ్లించుకుంది. అయితే వాటిని రెండు విధాలుగా వాడుకుని మళ్లీ తిరిగి ఇచ్చేస్తుంది.
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము ప్రభుత్వం వద్దనే ఉంటుంది. ఇది ఎంత ఉంటే అంత ప్రభుత్వం తీసుకున్న రుణంగా భావిస్తారు. ప్రభుత్వం డీఏ బకాయిలు.., ఇతరత్రా రావాల్సిన వాటిని జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తూ ఉంటుంది. వాటికి వడ్డీ చెల్లిస్తుంది. ఇలా తీసుకున్న మొత్తం రుణ పరిమితిలోకి కూడా వస్తుంది. దీన్ని పబ్లిక్ డెట్ అంటారు. ప్రభుత్వం కాగ్ వంటి సంస్థలకు లెక్కలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ రుణం ఇంత పెద్ద మొత్తంలో ఉంది అని చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెబితే రుణ పరిమితి దగ్గిపోతుంది. అందుకే జీపీఎఫ్ ఖాతాలను ఖాళీ చేసేసి.. అసలు అలాంటి అప్పే లేదని చూపించి రుణ పరిమితి పెంచుకోవడానికి నివేదికలు తయారు చేస్తారు. ఆ తర్వాత జీపీఎఫ్ ఖాతాల నుంచి తీసుకున్న మొత్తాన్ని మళ్లీ జమ చేస్తారు. అంటే అప్పుల కోసం పడుతున్న “దొంగ లెక్కల” తిప్పల్లో భాగంగా ఇలా చేస్తున్నారన్నమాట.
ఈ మధ్యలో ఉద్యోగుల నుంచి తీసుకున్న మొత్తాన్ని ఇతర అవసరాలకు వాడుకుంటారు. మళ్లీ జమ చేయాల్సి వచ్చినప్పుడు… ఆ లెక్కల ద్వారా తెచ్చుకున్న రుణ పరిమితి పెంపుతో ఆర్బీఐ దగ్గర బాండ్లను వేలం వేసి తెచ్చి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇక్కడ ఉద్యోగులు భయపడాల్సిందేమీ లేదు. అయితే ప్రభుత్వం ఇలా తీసేసుకుని.. తమ ఖాతాలకూ అలాంటి తప్పుడు లెక్కలేవో చూపిస్తే త మ పరిస్థితి ఏమిటనేది ఉద్యోగాల ఆవేదన. అలాంటి పరిస్థితి వస్తే.. ఉద్యోగులు ఎవరికీ చెప్పుకోలేరు. ఏమీ చేయలేరు. చూస్తూండిపోవాలి అంతే !