నందమూరి బాలకృష్ణ వందో సినిమా ఎలా ఉండాలో… అలాంటి సినిమానే అందించాడు క్రిష్! ఓ చరిత్ర పురుషుడి కథని అద్భుతంగా తెరకెక్కించి ఔరా.. అనిపించుకొన్నాడు. అన్ని చోట్లా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. బాలయ్య సినిమాకి కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్లు లభిస్తున్నాయి. క్రిష్ కెరీర్లోనే ఇది భారీ విజయం. ఆ మాటకొస్తే తొలి కమర్షియల్ హిట్. ఓవర్సీస్లోనూ బాలయ్య సినిమా తడాఖా చూపిస్తోంది. అక్కడి స్పందన చూశాక.. చిత్రబృందంలో ఆనందం మరింత రెట్టింపు అవుతోంది. అందుకే ఇప్పుడు బాలయ్య, క్రిష్ అమెరికా వెళ్తున్నారు. అక్కడ విజయోత్సవ టూర్‌కి ప్లానింగులు సిద్ధమవుతున్నాయి. తిరిగొచ్చాక గౌతమి పుత్ర శాతకర్ణి సక్సెస్ మీట్‌ని భారీ ఎత్తున చేయాలని చిత్రబృందం డిసైడ్ అయ్యింది.
గౌతమి పుత్ర కి హైదరాబాద్‌లో క్లాప్ కొట్టారు. కోటి లింగాలు దగ్గర ట్రైలర్ విడుదల చేశారు. తిరుపతిలో పాటల్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ మూడు చోట్ల సక్సెస్ మీట్ జరపాలని చిత్రబృందం భావిస్తోంది. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ… ఈ మూడు చోట్లా విజయోత్సవ సభని భారీ ఎత్తున చేయాలని క్రిష్ అండ్ టీమ్ భావిస్తోంది. ఒక్కో వేడుకకు ఒక్కో పేరు పెడతారట. అమెరికా నుంచి తిరిగొచ్చాక… సక్సెస్ టూర్ ప్లాన్ చేయాలని, అందులో భాగంగానే మూడు చోట్ల సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేయాలని క్రిష్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ని ప్రకటిస్తారు.