జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర వేస్తున్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామ సీమలను సిరుల సీమలుగా మార్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో మొదటి అడుగు బలంగా పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభల్ని నిర్నహిస్తున్నారు. ఈ గ్రామసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా పాల్గొంటోంది. గ్రామాల్లో సమస్యల పరిష్కార లక్ష్యంగా ఈ సభలు జరగనున్నాయి.
గత ఐదేళ్ల కాలంలో పంచాయతీల్ని..గ్రామ పాలనను.. గ్రామాల అస్థిత్వాన్ని వైసీపీ సర్కార్ ప్రశ్నార్థకం చేసింది. సచివాలయ వ్యవస్థను తీసుకు వచ్చి గ్రామ పాలనకు అర్థం లేకుండా చేసింది. పాలనలో గ్రామీణ వ్యవస్థల ప్రమేయం లేకుండా చేయడం.. పెద్ద ఎత్తున నిధుల్ని మళ్లించడంతో గ్రామాల్లో సమస్యలు పెరిగిపోయాయి. నీటి అవసరాలు తీర్చడానికి మోటార్లకు రిపేర్లు చేయించేందుకూ సర్పంచ్ల వద్ద డబ్బులు ఉండేవి కావు.
మరో వైపు ఉపాధి హామీ పథకం నిధులతోనూ రాజకీయమే చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు అవసరం అని.. లేపోని భవనాలను నిర్మించి ఉపాధి హామీ నిధుల్ని దుర్వినియోగం చేశారు. ఆ భవనాల కాంట్రాక్టుల్ని తీసుకుని వైసీపీ నేతలు సంపాదించుకున్నారు. గ్రామాల్లో అసలు రోడ్లే వేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ గ్రామ సభల ద్వారా పరిష్కరించడం .. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు… కానీ… ఆ సమస్యల పరిష్కారానికి ఓ మార్గం అంటూ ఈ గ్రామసభల ద్వారా ఏర్పడుతుంది. ప్రజలు కోరుకునేది కూడా ఇదే. పవన్ కల్యాణ్ ఆ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్ మార్క్ ప్రారంభమయిందని అనుకోవచ్చు.