వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు నాలుగు నెలలు నిండాయి. ఈ నాలుగు నెలల్లో…ఆయన మార్క్ స్పష్టంగా చూపించిన విషయం.. ఉద్యోగాల నియామకం. గ్రామాల వారీగా చూసుకుంటే… గ్రామానికి పన్నెండు మంది ఉద్యోగులు కొత్తగా అపాయింట్ అయ్యారు. వీరికి గ్రామ వాలంటీర్లు అదనం. రెండు వేల మంది జనాభాకు.. ఒక గ్రామ సచివాలయం పెట్టి.. వారి అవసరాలను.. 12మంది ఉద్యోగులతో తీర్చే ప్రయత్నం చేయడం అనేది ఓ విప్లవాత్మకమైన ఆలోచన. దీన్ని జగన్మోహన్ రెడ్డి.. ఆలోచించారు.. ఆచరణలో పెట్టారు. గ్రామ, వార్డు సచివాలయాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి ఒకటో తేదీ నుంచి వాటిల్లో 500 రకాల సేవలు అందుతాయి.
గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల వద్దకు పాలన …!
ప్రజలకు పాలన చేర్చితే… ప్రభుత్వానికి అంతకు మించిన తిరుగులేని విజయం ఉండదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కొత్త ప్రయోగం… గ్రామ, వార్డు సచివాలయాలు. ప్రజలకు వద్దకు పాలన అంటే… ఇదే అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. పదకొండు మంది .. వివిధ రంగాల్లో.. నిపుణులైన ఉద్యోగులు ఇక్కడ ఉంటారు. ప్రజల అవసరాలను వారు నిమిషాల్లోనే తీర్చగలరు. ఇక ప్రభుత్వ పరమైన.. పథకాలు ఏవైనా.. కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేదు. గ్రామ, వార్డు సచివాయాల్లో దరఖాస్తు అందిస్తే.. 72 గంటల్లో పరిష్కారం లభిస్తుంది. ఇది నిజంగా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే భరోసాలాంటిదే. ప్రజలకు ఏ కష్టం వచ్చినా… ప్రభుత్వం ఉందని గుర్తు చేసే వ్యవస్థ.
ఉద్యోగాల కల్పనలోనూ… సరికొత్త రికార్డు..!
గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపుగా లక్షన్నర మందిని నియమిస్తున్నారు. వీరంతా గ్రామ వాలంటీర్లకు అదనం. గ్రామ వాలంటీర్లు కేవలం స్వచ్చంద సేవకులు మాత్రమే. వారికి ఇచ్చేదిగౌరవ వేతనం. కానీ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రం పర్మినెంట్ ఉద్యోగులు. మొదట రెండేళ్లు వారికి ప్రొబేషన్ పిరియడ్ గా భావిస్తున్నారు. ఈ సమయంలో వారికి నెలకు రూ. పదిహేను వేలు ఇస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగుల స్కేల్ వర్తింపచేస్తారు. అంటే.. రెండేళ్ల తర్వాత.. అందరూ.. అంటే.. లక్షన్నర మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు. యువతకు ఈ తరహాలో భారీగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం మరొకటి లేదని.. చెప్పుకోవచ్చు.
పర్యవేక్షణ లేకపోతే.. మొదటికే మోసం..!
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను పంచాయతీరాజ్ శాఖ నియమిస్తోంది. బహుశా.. జీతాలు కూడా పంచాయతీరాజ్ శాఖనే ఇస్తుంది. అయితే.. అన్నింటిలోనూ కొత్త వారినే తీసుకుంటున్నారు. వీరందరూ.. నేరుగా.. ఉద్యోగంలోకి వస్తున్నారు. పెద్దగా.. శిక్షణ లేకుండానే.. .వీరంతా.. ప్రజల అవసరాల్ని తీర్చడానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో.. పకడ్బందీ పర్యవేక్షణ ఉండాలి. లేకపోతే.. సమస్యలు తీర్చడానికి బదులు వారు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఈ విషయంలో.. ప్రభుత్వం మరింత కేర్ ఫుల్గా వ్యవహరించాల్సి ఉంది. ఎన్నో అంచనాల మధ్య… గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభమవుతున్నాయి. ఆ అంచనాలను అందుకునేలా ప్రజలకు సేవలందించాల్సి ఉంది.