పవన్ పై కోర్టుకెళ్లడానికి ఏకంగా జీవోలు జారీ చేసిన ప్రభుత్వం.. తమ వల్ల కాదని.. చివరికి ఓ వాలంటర్ ను రంగంలోకి తెచ్చింది. విజయవాడ సివిల్ కోర్టులో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ వాలంటీర్ తో పిటిషన్ వేయించారు. వాలంటీర్ ఇచ్చిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది కోర్టు. ఆ మహిళా వాలంటీర్.. తన పిటిషన్లో చాలా విషయాలు చెప్పారు. పవన్ కల్యాణ్ తమపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురయ్యారట. అందుకే న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారని చెప్పకొచ్చారు.
ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పిటిషన్ దాఖలు చేశారు వాలంటీర్ తరపు న్యాయవాదులు. బాధితురాలు పవన్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యారని.. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది.. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు కోర్టు నోటీసులు ఇస్తుందని ఆ లాయర్లు చెప్పుకున్నారు. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి.. వాలంటీర్లలో అధికశాతం మహిళలు ఉన్నారు.. ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలని లాయర్లు చెప్పుకొచ్చారు.
ధైర్యంగా ప్రభుత్వం పవన్ పై పిటిషన్ వేయలేక వాలంటీర్ల వెనుక దాక్కుంటోందని జనసేన నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేయాలో తెలుసని.. హైకోర్టుకు కాకుండా.. కింది సివిల్ కోర్టులో .. వైసీపీ తరపున లాయర్లు చేసే రాజకీయం ఏమిటో మొత్తం తెలుసని జనసేన నాయకులంటున్నారు. ఈ విషయంలోనూ వలంటీర్లను బలి పశువుల్ని చేయడం ఎందుకని.. నేరుగా జగన్ రెడ్డే రావొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.