వాలంటీర్లు ఉద్యోగులు కారు. వాలంటీర్లు అంటే.. స్వచ్చందంగా.. ప్రజలకు సేవ చేయడానికి వచ్చినవారు. వారికి ప్రభుత్వం రూ.ఐదు వేల గౌరవ వేతనం ఇస్తోంది. అయితే.. ఏపీ సీఎం జగన్ మాత్రం… దీన్ని ఉద్యోగంగానే చెబుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా.. వాలంటీర్లకు.. ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చారు. వాలంటీర్లు బాగా సేవ చేసి… మంచి పేరు తెచ్చుకుంటే.. వాళ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లీడర్లను చేస్తానని ప్రకటించారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను.. ప్రారంభించిన తర్వాత జగన్… కీలకమైన వ్యాఖ్యలు చేశారు. యాభై ఇళ్ల బాగోగులన్నింటినీ వాలంటీర్ చూసుకోవాలని… అవినీతికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. తాను నమ్మిన వాలంటీర్లు తనను మోసం చేయరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లోనూ.. ఈ వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నియామక పత్రాలు అందజేశారు. వైసీపీ నెంబర్ టూ విజయసాయిరెడ్డి వాలంటీర్ల ఎంపికలో కులం, మతం చూడలేదని.. కేవలం … వైసీపీ కార్యకర్త అవునో కాదో మాత్రమే చూశామని.. బహిరంగంగానే చెప్పారు. ఈ క్రమంలో… వైఎస్ జగన్మోహన్ రెడ్డి… మరింత ముందుకు వెళ్లి .. వాలంటీర్లు బాగా పని చేస్తే., లీడర్లను చేస్తానని ప్రకటించడం… రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. వాలంటీర్లకు.. ప్రజలు పన్నులుగా కడుతున్న డబ్బులను గౌరవ వేతనాలుగా ఇస్తున్నారు. వారిని కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ.. పార్టీ కార్యకర్తలనే ఎంపిక చేసుకోవడమే కాదు.. వారి నుంచి వైసీపీ ద్వితీయ శ్రేణి నేతల్ని తయారు చేసుకుంటామన్నట్లుగా జగన్ ప్రకటించడం.. అదీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో…ఆఫర్ ఇవ్వడం.. చర్చనీయాంశమవుతోంది.
గ్రామ వాలంటీర్ వ్యవస్థపై ఇప్పటికే ప్రజల్లో ఓ రకమైన నెగెటివ్ అభిప్రాయం ఏర్పడిందనే భావన ఉంది. ఇలాంటి సమయంలో.. సొంత కార్యకర్తల కోసమే.. ఇలా చేస్తున్నారనే భావన వచ్చేలా జగన్ వ్యాఖ్యానించడం.. ముందు ముందు రాజకీయ చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి.. గ్రామ వాలంటీర్లు పూర్తి స్థాయిలో విధుల్లోకి వెళ్తారు. పించన్లు, రేషన్ లాంటి.. పథకాలను డోర్ డెలివరీ చేస్తారు. ఆ తర్వాతే వారి పనితీరుపై ప్రజల్లో స్థిరమైన అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది.