జీతాలు పెంచాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని రకరకాల డిమాండ్లు చేస్తూ రోడ్డెక్కిన వాలంటీర్ల గురించి తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి కలత చెందారు. వారందరికి కళ్లు తెరిపించేలా ఓ లేఖ రాశారు. అయితే ఒక్కొక్కరికి నేరుగా రాయలేదు. బహిరంగ లేఖ రాశారు. బహుశా ఆయన ఉద్దేశం ప్రకారం.. వాలంటీర్లు మాత్రమే కాదు.. ప్రజలు కూడా ఆ లేఖను చదివి.. అవగాహన పెంచుకోవాలన్న ఉద్దేశం కావొచ్చు. అయితే ఆ లేఖలో ఉన్న అంశాలు.. గతంలో ఆయన చెప్పిన మాటలకు భిన్నంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు చర్చోపచర్చలకు కారణం అవుతున్నాయి.
వాలంటీర్లు ఉద్యోగులు కాదా..!?
వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి రాసిన బహిరంగలేఖలో చాలా స్పష్టంగా చెప్పారు… మీవి ఉద్యోగాలు కాదు.. మీరు స్వచ్చంద సేవకులు మాత్రారమే. మీకు ఇస్తోంది జీతం కూడా కాదు.. గౌరవ వేతనం మాత్రమే అని. కానీ గత రెండేళ్ల కాలంలో అనేక సందర్భాల్లో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే.. తాము అధికారంలోకి రాగానే నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చాం. అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చాం అని చెప్పుకున్నారు. అది మీడియా ఇంటర్యూ కావొచ్చు… స్వాతంత్ర్య దినోత్సవ వేదిక కావొచ్చు… ఎలాంటి పరిస్థితిని అయినా వదిలిపెట్టలేదు. తమ ఉద్యోగాల ఘనత గురించి గొప్పగా చెప్పారు. అనేక సార్లు పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ఈ కారణంగానే ఆయన మేనిఫెస్టోలో పెట్టినట్లుగా.. ప్రతీ ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. రెండేళ్లుగా అమలు చేయడం లేదు. కానీ ఇప్పుడు వాలంటీర్లు జీతాల పెంపు గురించి ప్రస్తావించే సరికి.. ఉద్యోగాలు కాదని మాట మార్చేస్తున్నారు.
ప్రజలకు మేనిఫెస్టో… వాలంటీర్లకు హ్యాండ్ బుక్..!
వాలంటీర్లకు హ్యాండ్ బుక్ ఇచ్చామని అందులో … మీది ఉద్యోగం కాదని.. స్పష్టంగా చెప్పామని… వాలంటీర్లు సేవకులు మాత్రమేనని ఉందని.. దానికి వారు ఒప్పుకున్నారని కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఈ హ్యాండ్ సంగతేమిటో కానీ… అమలు చేస్తానన్న హామీలు అమలు చేయకుండా… ప్రతీ దానికి మేనిఫెస్టో చూపించడం ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఇతర వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. సన్నబియ్యం దగ్గర్నుంచి ఇళ్లన్నీ ఉచితంగా ఇస్తామన్న వరకూ అన్నీ అంతే. చంద్రబాబు హయాంలో కట్టిన ఇళ్లన్నీ ఉచితంగా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చేసి రూ.3 లక్షల కంటే తక్కువ విలువైన ఇళ్లు మాత్రమే ననని మాట మార్చేశారు. అదేమంటే మేనిఫెస్టో చూస్కోండి అంటున్నారు. అనేక పథకాల విషయంలో అంతే.. ఇప్పుడు ఆ స్టైల్లో వాలంటీర్ల విషయంలో అమలు చేస్తున్నారు. హ్యాండ్ బుక్ ఇచ్చాం చదువుకోలేదా… అని తీరిగ్గా చెబుతున్నారు.
వాలంటీర్లతో చేయించుకుంటున్న పనిపైనా సీఎంకు అవగాహన లేదా..?
వాలంటీర్లకు ఐదు వేలు మాత్రమే ఇస్తూండటాన్ని సమర్థించుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి.. వారి పనిని తక్కువ చేసేందుకు లేఖలో ప్రయత్నించారు. వారానికి మూడు రోజులు.. అదీ కూడా వారికి వీలున్నప్పుడల్లా అందుబాటులో ఉన్నామని చెప్పడానికే వస్తున్నారని ఇంకేమీ పనులు చేయడం లేదని ఆయన అంటున్నారు. కానీ వాలంటీర్ల వాదన వేరేలా ఉంది. అధికారులు ప్రతీ పనికి వాలంటీర్ల మీద పడుతున్నారు. అంతే కాదు.. అధికారులు చెప్పే పనికి.., పార్టీ పని అదనం. పార్టీ కోసం .. వైసీపీ నేతలు ఎక్కువగా పని చేయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే… జీతాలు తీసుకునే రెగ్యులర్ ఉద్యోగులు.. వైసీపీ నేతలు తాము చేయాల్సిన పనులను వాలంటీర్ల మీద పెడుతున్నారు. కొత్తగా రేషన్ డోర్ డెలివరీ విషయంలోనూ బాధ్యతలిచ్చారు. దాంతో వారు ఉదయం బయటకు వస్తే.. రాత్రికి ఇంటికి వెళ్లే పరిస్థితి. అందుకే తమతో గొడ్డు చాకిరి చేయించుకుంటూ అతి తక్కువ వేతనం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ. ఎనిమిది వేలు ఇస్తామని ఏడాది కిందట చెప్పింది నిజం కాదా..!?
వాలంటీర్లకు ఎనిమిది వేల జీతం ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వం చేసింది. ఈ విషయం ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. అయితే ఆ తర్వాత సైలెంటయ్యారు. దీనికి కారణం ఏమిటో తెలియదు కానీ.. ఏడాది తర్వాత కూడా వారికి జీతాలు పెంచే ప్రయత్నం చేయకపోగా.. ఐదు వేలు స్వచ్చంద సేవకు మాత్రమే ఇస్తున్నామని చెప్పడం ప్రారంభించారు. దీంతో వాలంటీర్లకు షాక్ తగిలినట్లవుతోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వాలంటీర్లకు రాసిన బహిరంగలేఖలో… అనేక అంశాలు ఉన్నాయి. వారిపై ప్రతిపక్షపార్టీల ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. ఇతరు ట్రాప్లో పడ్డారని.. వారు రెచ్చగొడితే రెచ్చిపోతున్నారన్నట్లుగా లేఖలో వ్యాఖ్యానించారు. అంతే కాదు.. ఇంకా ఎక్కువగా ఆందోళనలు చేస్తే… వాలంటీర్ల వ్యవస్థ ఉండదన్నట్లుగా కూడా మాట్లాడారు. అలా చేయడానికి విపక్షాలు కుట్ర పన్నుతున్నట్లుగా కూడా సీఎం లేఖలో చెప్పుకొచ్చారు. వాస్తవానికి వాలంటీర్లు అందరూ.. వైసీపీ నేతల అనుచరులే. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారు కూడా. అయినా ఇప్పుడు వారి కష్టాలు తీర్చమని రోడ్డెక్కే సరికి… సీఎం జగన్ వ్యూహం మారిపోయింది.