ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వలంటీర్ల వ్యవస్థ… కొత్త గందరగోళానికి దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి యాభై ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. గ్రామ, పట్టణాల్లో కలిపి రెండు లక్షల అరవై తొమ్మిది వేలవాలంటీర్ పోస్టులు మంజూరు చేశారు. శరవేగంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. నియామక పత్రాలు అంద చేశారు. అధికారికంగా వారంతా.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అంటే.. రేపట్నుంచే విధుల్లోకి చేరనున్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి డోర్ డెలివరీ చేయబోతున్నారు. పెన్షన్లు, రేషన్ బియ్యం లాంటి 30కి పైగా ప్రభుత్వ పథకాలు వారి చేతుల మీదుగానే… పంపిణీ జరగనున్నాయి. అయితే.. ఈ విషయంలో.. అనేక చోట్ల గందరగోళం ఏర్పడటానికి అవకాశం కనిపిస్తోంది.
ఎంపిక చేసిన వారిలో… 20వేల మంది గతంలోనే… నియామక పత్రాలు తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత వివిధ కారణాలతో.. 40వేల మంది దూరంగా ఉంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయిలో పని చేయాలనే నిబంధన పెట్టడం.. ఇతరంగా చదువులు కానీ.. ఉద్యోగాలు కానీ చేయకూడదని అఫిడవిట్ తీసుకోవడంతోనే అసలు సమస్య వచ్చింది. అనేక మంది విధుల్లో చేరేందుకు.. నిరాకరిస్తున్నారు. వేరే ఉద్యోగాలు, ఉపాధి పొందే వాళ్లు, చదువుకునే వాళ్లు మొత్తం వదిలేసి రూ. ఐదు వేలకు పని చేయడానికి సిద్ధం కాలేకపోతున్నారు.
గ్రామవాలంటీర్ పోస్టు రూ. ఐదు వేలు గౌరవ వేతనం వచ్చే పోస్టు మాత్రమే. దీని కోసమే సమయం మొత్తం వెచ్చించాలంటే.. ఎంత వైసీపీ కార్యకర్త అయినప్పటికీ.. సాధ్యమయ్యే పని కాదు. అందుకే..ఇప్పుడు చేరని వారు మాత్రమే కాదు.. విధుల్లో చేరినప్పటికీ.. తర్వతా డ్రాపయ్యేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే అంచనాలున్నాయి. వారందర్నీ.. మళ్లీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ.. అసలు గందరగోళం…. ఇప్పటి వరకూ.. ఆ ప్రభుత్వ పథకాలు పంపిణీ చేసిన ఉద్యోగులు.. వాలంటీర్ల మధ్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. పెన్షన్ల సొమ్ము.. సరిగ్గా డెలివరీ చేయకపోతే… వృద్ధుల నుంచి ఆ ఆగ్రహాన్ని ఉద్యోగులు చవిచూడాల్సి వస్తుంది. ప్రతీ పథకంలోనూ అదే పరిస్థితి ఉంటుంది. అందుకే.. వలంటీర్ వ్యవస్థ ఉద్యోగుల్లోనూ టెన్షన్ రేపుతోంది.