బిహార్ ఎన్నికలలో బద్ధ విరోదులయిన పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలలో బీజేపీని మట్టి కరిపించడంతో, వచ్చే ఏడాదిలో జరుగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే ఫార్ములాను అమలు చేసి అధికారం నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రాధాన ప్రతిపక్షమయిన బహు జన్ సమాజ్ వాదీ పార్టీ (బి.ఎస్.పి.) తో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసుకోవాలనుకొంటున్నట్లు అధికార పార్టీకి చెందిన మంత్రి ఎం. కిద్వాయ్ అన్నారు. రాష్ట్రంలో అధికార సమాజ్ వాదీ, బహు జన్ సమాజ్ వాదీ పార్టీలు బద్ద విరోదులుగా వ్యవహరిస్తున్నాయి. కనుక వాటిమధ్య పొత్తులు, మహాకూటమి ఏర్పాటు అసాధ్యమేనని భావించవచ్చును.
ఒకవేళ అవి కలిసి పనిచేసేందుకు సిద్దపడినా బిహార్ లో ఫలించిన మహాకూటమి మంత్రం అన్ని చోట్లా ఫలిస్తుందా? బిహార్ లో మహాకూటమి చేతిలో భంగపడిన బీజేపీ అందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా చేతులు ముడుచుకొని కూర్చోంటుందా? మొదట డిల్లీలో తరువాత బిహార్ లో ఘోరపరాజయం పొందిన బీజేపీ మళ్ళీ మరో అపజయాన్ని భరించగలదా? మళ్ళీ అపజయం ఎదురయితే అప్పుడు బీజేపీ పరిస్థితి ఏమవుతుంది? అనే సందేహాలు కలుగుతాయి. ఒకవేళ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం మహాకూటమి ఏర్పాటుకి ప్రయత్నాలు మొదలుపెడితే బీజేపీ కూడా అదే పని చేయవచ్చును. అయినా బిహార్ లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. ఉత్తరప్రదేశ్ లో పరిస్థితులు వేరు.
బిహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దాణా కుంభకోణం కేసులో జైలుకి వెళ్లి రావడం, తత్ఫలితంగా ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడవడం, చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉంటున్న కారణంగా మహాకూటమి ఏర్పాటుకి నితీష్ కుమార్ స్వయంగా ఆహ్వానించడంతో లాలూ ప్రసాద్ యాదవ్ దానినొక గొప్ప అవకాశంగా గుర్తించి మహాకూటమిలో భాగస్వామి అయ్యేరు. మహాకూటమి విజయం సాధించడంతో ఆయన సరయిన నిర్ణయమే తీసుకొన్నారని అర్ధమవుతోంది. కానీ మాయావతి నేతృత్వంలో బి.ఎస్.పి. రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. ఇదివరకు ఆమె రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నందున ఆమె ప్రభావం రాష్ట్ర ప్రజలపై బలంగానే ఉంది. ముఖ్యంగా బలహీనవర్గాలలో ఆమె పార్టీకి చాలా గట్టి పట్టు ఉంది. పైగా అధికార సమాజ్ వాదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బి.ఎస్.పి. చాలా తీవ్రంగా పోరాడుతోంది. కనుక ఒకవేళ అధికార పార్టీ తమతో పొత్తులు పెట్టుకొని మహాకూటమికి ఆసక్తి చూపినప్పటికీ, బి.ఎస్.పి. ఆసక్తి చూపకపోవచ్చును. అంతకంటే బీజేపీతో చేతులు కలిపినట్లయితే రాష్ట్రంలో తమకే అధికారం కట్టబెట్టి బీజేపీ కేవలం భాగస్వామిగా ఉండేందుకు సిద్దపడవచ్చును. అయినా ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది కనుక ఈలోగా ఏమయినా జరుగవచ్చును. పరిస్థితులను, అవసరాలను బట్టి ఎవరు ఎవరితో అయినా దగ్గర లేదా దూరం అవవచ్చును.