వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సిపిఐ, కాంగ్రెస్‌లతో కలసి సింగరేణిలో టిఆర్ఎస్కు వ్యతిరేకంగా భీషణ పోరాటం చేస్తుంటే- టిడిపి అగ్రనాయకత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదా? అనంతపురంలో పరిటాల శ్రీరామ్ వివాహ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు జేజేలు కొట్టడం, టిడిపి నేతలతో ఆయన కలగలపుతనం, వాకబులు, అన్నీ ఆ దిశలోనే వున్నాయి. నంద్యాలకు నల్లగొండకు పోలికను కూడా పెంచే కథనాలు వస్తున్నాయి. చెప్పాలంటే రాష్ట్రాలు రెండయినా రాజకీయం ఒక్కటేనన్నట్టు నడిచింది అక్కడ దృశ్యం.షరా మామూలుగా కులవారీ విశ్లేషణలూ వినిపించాయి. పైగా ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా కెసిఆర్ బృందంలో భాగంగా వుండటం మరో ఆకర్షణగా వుండింది. ఈ విషయాన్ని ఎబిఎన్ ఛానల్ స్పష్టంగా చెప్పింది కూడా. తెలంగాణ రాజకీయాల్లో ఏదో రూపంలో టిడిపి బిజెపి టిఆర్ఎస్ కలసి వ్యవహరిస్తాయని రాజకీయ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి వంటివారు కాంగ్రెస్‌తో కలసి వెళ్దామని ప్రతిపాదిస్తే చంద్రబాబు అనుమతించలేదని ముఖ్య నేతలు చెబుతున్నారు. సింగరేణిలో జరిగేది నేరుగా రాజకీయ ఎన్నిక కాదు, పోటీలో వున్నది సిపిఐ అనుబంధం సంఘం గనక కలసి పోరాడుతుండొచ్చు గాని మామూలు ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలవడం కుదిరేపని కాదని, అది ఎపిలో తమకు రాజకీయంగా చెప్పలేనంత నష్టం అని ముఖ్య నాయకులే స్పష్టం చేస్తున్నారు. అసలు అనంతపురంలో కెసిఆర్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభించే ఏర్పాట్లపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతలు అప్పగించారట. స్నేహభావం మంచిదే గాని దాని వెనక వ్యూహ కోణం ఏమైనా వుందా అన్నదే ఇప్పుడు ఆలోచింపజేస్తున్నది.