హైదరాబాద్: ‘వంగవీటి’ చిత్రంకోసం కొన్ని రహస్యాలు తెలుసుకోవటానికి ఈ సాయంత్రం హైదరాబాద్‌నుంచి విజయవాడ వెళ్ళిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఘన స్వాగతం లభించింది. ఈ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గన్నవరం విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించారు. దీనితో వర్మ బాగా సంతోషంగా కనిపించారు. పోలీసులు కూడా విమానాశ్రయంవద్ద పెద్దసంఖ్యలో మోహరించారు. వివాదాల నేపథ్యంలో వర్మను వెనక్కు పంపిస్తారని ఒక సమయంలో భావించినప్పటికీ అలా జరగలేదు.
కారు ఎక్కుతుండగా మీడియా ప్రతినిధులు సంప్రదించగా, మూడు రోజులపాటు విజయవాడలో ఉంటానని వర్మ చెప్పారు. విజయవాడ రావటం ఎలా ఉందని అడగగా, బెజవాడ తనకు పుట్టినిల్లు లాంటిదని అన్నారు. విజయవాడలో ఎవరెవరిని కలవబోతున్నారని అడగగా, అన్ని కుటుంబాలవారినీ కలుస్తానని చెప్పారు. ఇంత ఘనస్వాగతం లభించటం ఎలా ఉందని అడగగా, తాను తీయబోతున్న సినిమా ఇక్కడివాళ్ళకు సంబంధించినది కావటంతో వారు తరలివచ్చారని వర్మ అన్నారు.
మరోవైపు రాంగోపాల్ వర్మ గన్నవరంలో విమానం దిగే సమయానికే కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రూ కూడా బెంగళూరునుంచి రాబోతున్నారని తెలియటంతో అక్కడ కొద్ది సేపు ఉత్కంఠ నెలకొంది. నెహ్రూ కారు ఎయిర్పోర్ట్వద్ద వేచిఉండటంతో ఆయన, వర్మ ఒకే ఫ్లైట్‌లో వస్తున్నారేమోనని భావించారు. అయితే నెహ్రూ తనకు ఫ్లైట్‌లో కలవలేదని వర్మ చెప్పారు. ఇదిలాఉంటే వర్మ బస చేస్తున్న ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్ వద్ద పోలీసులు బందోబస్తును పటిష్ఠం చేశారు. ఈ రాత్రికి వంగవీటి రాధాను వర్మ కలుస్తారని తెలుస్తోంది.