తెలంగాణలో టీడీపీ మహానాడు జరుగుతోంది. హైదరాబాద్ లోని నాంపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం హయాంలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారు. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది టీడీపీ అని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే, టెక్నాలజీ అవసరమని ముందుచూపుతో వ్యవహరించి సైబర్ టవర్స్ నిర్మించామనీ, ఆ తరువాత మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థల్ని ఇక్కడికి రప్పించడం కోసం ఎంతో ప్రయత్నించామన్నారు. అప్పుడు హైదరాబాద్ కి నీటి సమస్య ఉండేదనీ, టీడీపీ హయాంలోనే దానికి శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. ఇలా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు.
ఇక, కార్యకర్తల గురించి స్పందిస్తూ త్యాగాలకు వెనుదీయకుండా టీడీపీ జెండా మోస్తున్నందుకు అభినందించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనీ, మరోసారి టీడీపీ శ్రేణులు సంఘటితం కావాలనీ, మన శక్తి ఏంటో నిరూపించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో తన వెంట ఉంటారన్న భరోసా కనిపిస్తోందన్నారు. కార్యకర్తల బలం ఉంటే, కొండలనైనా పిండి చేసే శక్తి ఈ తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. జాతీయ రాజకీయాలు, కర్ణాటక పరిణామాల గురించి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల తరువాత తెలుగుదేశం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. భాజపా నిర్లక్ష్యం గురించి మాట్లాడుతూ… ఆంధ్రా, తెలంగాణలకు ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు.
ఓవరాల్ గా చూసుకుంటే… తెలంగాణ కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం మరోసారి చేస్తున్నారు. కానీ, ఈ క్రమంలో టీడీపీ అధినేత గతంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. తెలంగాణలో భవిష్యత్తు కార్యాచరణ ఏంటనే స్పష్టత ఇంకా ఇవ్వడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్ర నిర్లక్ష్యం ఒకేలా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏపీ సమస్యలపైనే ఎక్కువ స్పందిస్తున్నట్టుగా వినిపించింది. ప్రస్తుతం తెలంగాణ టీడీపీకి అందాల్సి భరోసా ఇంకా అందడం లేదన్న లోటు కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వంలో భవిష్యత్తుపై స్పష్టత లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బలం చాటుదాం అని చంద్రబాబు చెబుతున్నా… ఆ చాటే క్రమం ఏంటి..? ఏ రాజకీయ లక్ష్యంతో ముందుకు సాగాలనే స్పష్టత ప్రస్తుతానికి లేదు. ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఈ మహానాడులో కార్యకర్తలకు ఎన్నో ప్రశ్నలూ, భవిష్యత్తుపై కొన్ని అనుమానాలూ ఉన్నాయి. వాటిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇంకా గతం గతం అంటుంటే… హైదరాబాద్ అభివృద్ధి జరిగింది టీడీపీ హయాంలోనే కావొచ్చు… కానీ, విభజన తరువాత తెలంగాణలో టీడీపీ పాత్ర ఎలా ఉండాలనే స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. తెలంగాణలో అజెండా ఏంటనేదే అసలు ప్రశ్న..?