గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ నేతలు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కార్పొరేటర్లలో అంతర్మథనం మొదలైంది. తాము కలిసేందుకు ప్రయత్నిస్తున్నా.. కేటీఆర్ కనీసం టైమ్ కూడా ఇవ్వడం లేదన్న అసంతృప్తితో బీఆరెస్ కార్పొరేటర్లు ఉన్నారు. వీరిని కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును కాంగ్రెస్ రంగంలోకి దింపింది.
ఆదివారం నాడు జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీఆరెస్ నాయకుడు బొంతు రామ్మోహన్.. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పారు. ఉప్పల్ నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన బీఆరెస్‌ను వీడాలనే నిర్ణయానికి వచ్చారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆయన భార్య ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్నారు. బీఆరెస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కూడా కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకాలను తట్టుకోలేకే పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే టీ పద్మారావు వైఖరిపై డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు కూడా రేవంత్ ను కలిశారు.
లోక్‌సభ ఎన్నికల్లోపే బీఆరెస్ నుంచి పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు, నాయకులను పార్టీలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు ముఖ్య నాయకులను రంగంలోకి దింపారని తెలుస్తున్నది. వారు ఇప్పటికే బీఆరెస్ కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. కేటీఆర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నవారందరితో ఇప్పటికే రెండు మూడు దఫాలుగా చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో బీఆరెస్, ఎంఐఎం పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మొత్తం 15 నియోజకవర్గాలలో బీజేపీ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి ఏడుగురు, బీఆరెస్ నుంచి ఏడుగురు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో పట్టు పెంచుకోవాలనే కసితో కాంగ్రెస్ నాయకులు జీహెచ్ఎంసి కౌన్సిల్లో బీఆరెస్‌ను ఖాళీ చేసి మానసికంగా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో ఉన్నారు.