గ్రేటర్లో బలపడటానికి బీజేపీ చాపకింద నీరులా ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ కార్పొరేటర్లపై గురి పెట్టింది. కూకట్ పల్లి కార్పొరేటర్ కావ్య బీజేపీలో చేరారు. ఇంకా 20 నుంచి 30 మంది కార్పొరేటర్లు బీజేపీ లో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం అవుతోంది. బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరి కార్పోరేటర్‌గా మళ్ళీ గెలిచిన ఒక నేత.. అసంతృప్తి గా ఉన్న కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు. కొందరు కార్పొరేటర్లు నేరుగా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. శివారు ప్రాంతాలకు చెందిన కొందరు కార్పొరేటర్లు ఇప్పుడే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ లో టిఆర్ఎస్ కు వందమంది కార్పొరేటర్లు వున్నారు. అయితే చాలా నియోజక వర్గాల్లో కార్పొరేటర్లకు స్థానిక ఎమ్మెల్యే లకు మధ్య పొసగటం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో రెండు వర్గాలు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది కార్పొరేటర్లు ప్రచారానికి సైతం దూరంగా వున్నారు. పైగా… సభ్యత్వం విషయంలోనూ పెద్దగా పట్టించుకోలేదు. దీంంతో వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో సగం మంది సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్ లు దక్కక పోవచ్చని చర్చ జరుగుతోంది.
కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ సిట్టింగ్ లకే టికెట్ లు వుంటాయని చెబుతూ ఇప్పటికి పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కానీ… ప్రస్తుతం.. బీజేపీ జోరులో ఉందని… బీజేపీకి వెళ్తేనే.. మంచి భవిష్యత్ ఉంటుందని… ప్రజల్లో పట్టు ఉన్న కొంత మంది కార్పొరేటర్లు.. ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ముందు ముందుగా టీఆర్ఎస్ కు… హైదరాబాద్ టెన్షన్ కాస్త ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. బీజేపీ అంతో..ఇంతో బలంగా ఉంది.. గ్రేటర్ పరిధిలోనే మరి..!