తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా అనుకుంటే.. అలా చేసేస్తారు. దుబ్బాక ఎన్నికల తర్వాత గ్రేటర్ ఎన్నికలను వాయిదా వేస్తారన్న అంచనాల నేపధ్యంలో భయపడే ప్రశ్నే లేదని సంకేతాలు ఇస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలను ఇప్పటికే బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కారణంగా వీలైనంత వేగంగా… ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనకు వచ్చారు. డిసెంబర్ నాలుగో తేదీన పోలింగ్ పెడితే ఎలా ఉంటుందన్నదానిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. మంత్రులు.. ఇతర కీలక నేతలతో కేసీఆర్ ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం తరపున ఎస్ఈసీతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీపావళి అయిన మరుసటి రోజునే.. నోటిఫికేషన్ వస్తుందని.. ఎస్ఈసీ వర్గాలు చెబుతున్నాయి. పదమూడో తేదీతో గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల జాబితాలు డివిజన్ల వారీగా రెడీ అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావొచ్చని ఎస్ఈసీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే ఆ తర్వాత దుబ్బాక ఫలితాలు రావడం… ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ప్రచారం జరగడంతో.. ఇక ఇప్పుడల్లా జరగవని అనుకున్నారు.
అయితే ఎన్నికలు వాయిదా వేస్తే ప్రజల్లోకి ఇంకా నెగెటివ్ సంకేతాలు వెళ్తాయని.. టీఆర్ఎస్ హైకమాండ్ అంచనాకు రావడంతో ఎన్నికలను వీలైనంత వేగంగా పెట్టి.. కంప్లీట్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించేది లేదని.. ఇప్పటికే ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ అధికారులు కూడా ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు.. నిర్వహిస్తానమని.. సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.