గ్రేటర్ఎన్నికలను వచ్చే ఏడాదే నిర్వహించాలని తాజాగా తెలంగాణ సర్కార్ నిర్ణయానికి వచ్చింది. ఈ నెల పదమూడో తేదీ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమని తెలంగాణ ఎస్ఈసీ పార్థసారధి ప్రకటించిన ఒక్క రోజులోనే ప్రభుత్వం మనసు మార్చుకుంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం అంత సేఫ్ కాదనే అభిప్రాయానికి వచ్చేసింది. దీనికి కారణంగా దుబ్బాక ఉపఎన్నికల్లో ఎదురు దెబ్బ తగులుతుందనే అనుమానం మాత్రమే కాదు.. గ్రేటర్లో ఇటీవల ఏర్పడిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్ని బస్తీల్లో ప్రజలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఇస్తామన్న రూ. పదివేలు ఇవ్వకపోవడమే. వరద బాధితులకు రూ. 10వేలు ఇస్తామని.. సరిపోకపోతే ఇంకా ఇస్తామని కేటీఆర్ ఘనంగా ప్రకటించారు. పంపిణీ కూడా ప్రారంభించారు. అయితే ఇందులో పార్టీ నేతల్ని ఇంక్లూడ్ చేశారు. అక్కడే తేడా కొట్టింది. పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారు. ప్రతీ ఇంటికి రూ. పదివేలు ఇవ్వడం అసాధ్యం. అందుకే.. కొంత మందికే ఇచ్చారు. దీంతో మిగిలిన వారందరూ టీఆర్ఎస్పై మండి పడుతున్నారు. కార్పొరేటర్ల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. పోనీ డబ్బులు తీసుకున్న వారైనా సంతృప్తిగా ఉన్నారా అంటే అదీ లేదు. వారికి పదివేలు ఇచ్చినట్లు రాసుకున్నారు కానీ.. ఐచ్చిందిఐదు వేల లోపే. దీంతో వారిలోనూ అసంతృప్తి ప్రారంభమయింది.
ఇక వరదల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. అనేక రకమైన మౌలిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటన్నింటినీ పరిష్కరించకపోతే ప్రజల ఆగ్రహం ఓట్ల రూపంలో కనిపిస్తుందేమోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే.. నవబంర్‌లో నిర్వహించాలనుకున్న ఎన్నికలను ఫిబ్రవరికి మార్చినట్లుగా చెబుతున్నారు. దుబ్బాక ఉపఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత దీనిపై.. ఓ స్పష్టతను టీఆర్ఎస్ క్యాడర్‌కు.. ఆ పార్టీ హైకమాండ్ పంపే అవకాశం ఉంది.