గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుకుంటామని ఘనంగా ప్రకటిస్తున్నారు కాంగ్రెస్ నేతలు… నిజంగా చేతల్లో దాన్ని నిరూపించుకోగలుగుతారా? అంటే వారికే పూర్తిస్థాయి నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదంటున్నారు.
నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టి కాంగ్రెస్‌కు ఒకింత ఊరటనిచ్చినట్లు కనిపించింది. అయితే నిజామాబాద్, మెదక్ జిల్లాలఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్ధులు చివరి నిముషంలో వాటిని ఉపసంహరించుకోవడం పార్టీని ఇబ్బందిపెట్టాయి.
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అలాంటి సీన్లే రిపీట్ అయితే, పరిస్థితి ఎంటన్న బెంగ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది . అధికార పక్షమైన టిఆర్ఎస్ ఈ ఎన్నికల్ని అత్యంతప్రతిష్టాత్మకంగా తీసుకుంది . గులబిలైనన్ని డివిజన్లలో కార్పొరేటర్ల ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవడానికి స్కెచ్ గీస్తోంది.
అదే ఇప్పుడు గ్రేటర్ కాంగ్రెస్‌లో బెంగ పుట్టిస్తున్నట్లు కనిపిస్తోంది . ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలతో మనం టికెట్ ఇచ్చే వాడు చివరి వరకు పోటీలో ఉంటాడా? చివరి నిముషంలో తన స్వార్థం చూసుకుని …పార్టీకి హ్యాండ్ ఇస్తే పరిస్థితేంటన్న టెన్షన్ కాంగ్రెస్ పెద్దల్లో కనిపిస్తోంది. దాంతో పోటీలో దిగే కార్పొరేటర్ అభ్యర్ధుల ఎంపికే వారికి పెద్ద తలనొప్పిగా మారుతుందంట.
అందుకే గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్లు దానం నాగేందర్, మర్రి శశిధర్‌రెడ్డి, ముఖేష్‌గౌడ్ వంటి వారి సొంత నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎంపిక చేసే బాధ్యతను వారికే కట్టబెట్టేస్తున్నారు . మీ సెగ్మెంట్ల పరిధిలో మీరే క్యాండెట్లను పెట్టుకోండని ఫ్రీహ్యాండ్ ఇచ్చేస్తున్నారు. అయితే సత్తా ఉన్న సీనియర్లు లేని మిగిలిన చోట్ల పరిస్థితే అర్థం కావడం లేదంట సీనియర్లకి.
తాజాగా గాంధీ భవన్లో కార్పొరేటర్ క్యాండట్ల కోసం ధరఖాస్తులు ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో ఎవరు పడితే వారు వచ్చి ధరఖాస్తులు పూర్తి చేసి ఇచ్చేస్తున్నారంట. వారిలో నమ్మదగిన వారెవ్వరో తేల్చుకోలేకపోతున్నారంట పార్టీ పెద్దలు. అదలా ఉంటే ఇప్పటికే క్యాండెట్ల గురించి సర్వే చేయించుకుంటోంది కాంగ్రెస్. అయినా చాలా డివిజనల్లలో అభ్యర్ధులపై నమ్మకం కుదురుతున్నట్లు కనిపించడం లేదు .
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎక్కడైతే గట్టి అభ్యర్ధులున్నారో అక్కడే పోటీ చేద్దాం? అనవసరంగా పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారంట కాంగ్రెస్ పెద్దలు. ఆ క్రమంలో గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉంటే దాదాపు 100 చోట్ల కూడా కాంగ్రెస్పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. రంగారెడ్డిని మినహాయిస్తే హైదరాబాద్‌లో 88 డివిజన్లు ఉన్నాయి . వాటిలో సగం ఓల్డ్ సిటీలో ఉంటాయి. ఎంఐఎం ప్రాభల్యం ఉన్న ఆ డివిజనల్లో పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి అలాంటివి వదిలేస్తే బెటర్ అని ఫిక్స్ అవుతున్నారంట. మొత్తమ్మీద గ్రేటర్ ఎన్నికల దెబ్బతో కొత్త తలనొప్పి వచ్చిపడినట్లు కనిపిస్తోంది కాంగ్రెస్‌కి.