గ్రేటర్ హైదరాబాద్‌లో భవనాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. టీజీ బీ పాస్ పేరుతో ఓ విధానం అమల్లో ఉంది.కానీ దాని వల్ల ఉపయోగం లేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం టీజీబీపాస్ స్థానంలో ‘బిల్డ్‌నౌ’ అనే కొత్త ఏకీకృత ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందు బిల్డ్ నౌ అనే విధానాన్ని సిద్ధం చేసింది.
ఫిబ్రవరి 1 నుంచి ఈ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. టీజీబీపాస్ లో డ్రాయింగ్ల పరిశీలనకు రోజుల తరబడి సమయం పడుతుందని, హైరైజ్ భవనాల డ్రాయింగ్ల విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఆధునిక సాంకేతికతతో పనిచేసే బిల్డ్‌నౌ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. బిల్డ్‌నౌ ద్వారా దేశంలోనే అత్యంత వేగంగా 5 నిమిషాల్లో డ్రాయింగ్ పరిశీలన పూర్తి అవుతుంది. దరఖాస్తులోనే జీవో నిబంధనలు తెలుసుకునేందుకు ఏఐ ఆధారిత సేవలు అందుబాటులో ఉంటాయి.
నూతన విధానంలో నాన్ హైరైజ్ భవనాల ఆమోదానికి పట్టే సమయం 21 నుంచి 15 రోజులకు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ సమయాన్ని 15 నుంచి 10 రోజులకు తగ్గిస్తున్నారు. రెరాతో అనుసంధానం చేసి రియల్ఎస్టేట్ వ్యాపార వృద్ధికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటారు. రాబోయే రోజుల్లో కార్యాలయాల లీజు కోసం 34 మిలియన్ చదరపు అడుగుల స్థలం కావాలని, ఉద్యోగులకు మరో 1.30 లక్షల ఇళ్లు అవసరమవుతాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దానికి తగ్గట్లుగా సేవల్లో వేగం పెంచాలని నిర్ణయించుకుంది.