మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇరవై నాలుగు గంటల్లోనే అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. టీ టీడీపీకి తమకు వచ్చే సీట్లు, అభ్యర్థుల జాబితాపై.. ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. అవి ఏ సీట్లో ఎవరికీ తెలియడం లేదు. కనీసం ప్రచారం చేసుకోమని కూడా… టీడీపీ హైకమాండ్ ఇంత వరకూ ఎవరికీ చెప్పలేదు. దీంతో అసెంబ్లీ సీట్లు ఆశిస్తున్న టీటీడీపీ నేతల్లో టెన్షన్ మొదలయింది. సీటు దక్కుతుందా…చేజారుతుందా అనే ఆందోళనలో టీటీడీపీ నేతలు వున్నారు. ఇప్పటికే తమకు టికెట్ కావాలంటూ అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
కాంగ్రెస్ తో జతకట్టిన టీడీపీ కి పధ్నాలుగు సీట్లు కేటాయించారు. పార్టీ లోని సీనియర్ నేతలు కొద్దీమంది మినహాయించి అసెంబ్లీ టికెట్ ఎవరికి దక్కుతుందో ఇంతవరకు స్పష్టత లేదు. మరో వైపు అసలు పొత్తులో భాగంగా తమ నియోజకవర్గమ్ టీడీపీ కి వస్తుందా….ఇతర పార్టీల కు వెళుతుందా స్పష్టత లేక టీడీపీ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలు సైతం టికెట్ కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంత వరకూ ఈ విషయంపై ఎటూ తేల్చలేదు. మరో సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సం పేట సీటు కోసం పట్టుబడుతున్నారు. అయితే అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటం తో పొత్తులో ఆ సిటు టీడీపీ కి వచ్చే అవకాశం కనపడటం లేదు. అయితే ఎలాగైనా నర్సంపేట సిటు దక్కేలా చూడాలి అని రేవూరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు రెండు సీట్ల కోసం పట్టు పడుతున్నారు. పొత్తులో భాగంగా ఒక సిటు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో దయాకర్ రెడ్డి మరో సిటు కోసం ఒత్తిడితెస్తున్నారు.
టీడీపీ నేతలు మరో రెండు ,మూడు సీట్లు కావాలని ఒత్తిడి చేయాలని చంద్రబాబును కోరుతున్నారు. టీడీపీ కి వచ్చే సీట్లలో సీనియర్ నేతలకు లైన్ క్లియర్ అవుతున్నా…గ్రేటర్ సీట్ల విషయంలో మాత్రం నేతలు ఆందోళన చెందుతున్నారు. శేరిలింగం పల్లి సిటు కోసం భవ్య ఆనంద్ ప్రసాద్, మొవ్వ సత్యనారాయణలు పోటీ పడుతున్నారు.ఈ ఇద్దరిలో సిటు ఎవరికి దక్కుతుందో తెలడం లేదు. కొత్తగా టీడీపీ లో చేరిన నందీశ్వర్ గౌడ్ పఠాన్ చెరు టికెట్ కోసం చంద్రబాబు ని కలిసే ప్రయత్నం జేస్తున్నారు. గ్రేటర్ లో టీడీపీ కి వచ్చే సీట్ల విషయంలో ఒక్క ఉప్పల్ మినహా మినహా అభ్యర్థులు ఎవరనేది క్లారిటీ లేదు. పార్టీ సీనియర్ నేత అరవింద్ కుమార్ గౌడ్ గ్రేటర్ లో జూబ్లీ హిల్స్ లేదా కుత్బుల్లాపూర్ టికెట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈయన కూడా చివరి ప్రయత్నంగా చంద్రబాబును కలిశారు. కానీ ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది.