కృష్ణానదికి ఆవలి ఒడ్డున గ్రీన్ క్యాపిటల్ సిటీఅమరావతికి శంకుస్థాపన జరగబోతుండగా, నదికి ఈవలి ఒడ్డున ఉన్న విజయవాడ భవంతులు ఉన్నట్టుండి గ్రీన్ గా మారబోతున్నాయా ? రాత్రికిరాత్రి బిల్డింగ్స్ కి గ్రీన్ ముసుగు వేయబోతున్నారా? ఎందుకని..!? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే…
ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన అక్టోబర్ 22- విజదశమిరోజున ఘనంగా జరగబోతుండగా, వీఐపీ అతిథులు వచ్చే రహదారులను అందంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇందులో భాగంగానే అతిథులు వచ్చే గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి రామవర్పాడు రింగ్ వరకు రహదారికి ఇరుపక్కలా ఉన్న భవంతులకు గ్రీన్ కలర్ వెయించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అధికారులు సదరు భవన యజమానులకు ఈ విషయం తెలియజేశారు . అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ రాజధాని శంకుస్థాపన నిజంగానే అందరి పండుగే. ఇందులో సందేహం లేదు. అయితే, అతిథులు వచ్చే రహదారులను ఆకుపచ్చగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలోనే అధికారులు పొరపాటుచేస్తున్నారనిపిస్తోంది. ఆకుపచ్చని చెట్లను, పూల మొక్కలతో హరితహారం సిద్దం చేయడానికి బదులుగా, ఆకుపచ్చ రంగుని భవంతులకు పులిమి అదే `గ్రీన్ సిటీ’ అని చెప్పి, అతిథులచేత తప్పట్లుకొట్టించాలన్న తపన వారిలో కనబడుతోంది.
శంకుస్థాపన తేదీ దగ్గరపడుతుండటంతో అధికారులు నానా హైరానా పడుతున్నారు. వీరికి ఈ ఆలోచన ఎక్కడ నుంచి వచ్చింది? ఈ మధ్యనే విశాఖపట్నంలో కొన్ని రహదారుల వెంబడి ప్రహరీ గోడలకు కార్పొరేషన్ వారు స్వయంగా వాల్ పెయింటింగ్స్ (థీమ్ పెయింటింగ్స్) వేయిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా సెలెక్ట్ చేసిన రహదారుల వెంబడున్న ప్రహరీ గోడలపై వినూత్న రీతిలో ఈ పెయింటింగ్స్ వేయిస్తున్నారు. బహూశా ఈ ఆలోచన ప్రేరణతో విజయవాడ అధికారులు ఇప్పుడు ఏకంగా భవంతులకే ఆకుపచ్చ రంగు పులిమించే పనిలో పడ్డట్టున్నారు.
అయితే మార్గమధ్యంలో ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు ఈ కలర్ గోలను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం డబ్బు ఇవ్వకుండా, ఇది అందరి పండగంటూ బలవంతంగా గ్రీన్ కలర్ వేయించాలనుకోవడం సరైనదికాదని అంటున్నారు. ఒక బిల్డింగ్ కు గ్రీన్ కలర్ వేయించాలంటే కనీసం పదివేలదాకా ఖర్చవుతుందనీ, ఆ సొమ్ము భవన యజమానులే పెట్టుకోవలనడం సరైనది కాదన్నది వారి వాదన.
విజయవాడ నగరపాలక సంస్థ కొద్దిరోజుల క్రిందటే తీసుకున్న ఈనిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కలర్ కోడ్ వల్ల అతిథులు ఆనందంతో పొంగిపోతారన్న అధికారుల ఆలోచనలోనే లోపం కనబడుతోంది. ఇది హడావుడిగా తీసుకున్న నిర్ణయంలా ఉంది. ఎందుకంటే, భవంతులకు గ్రీన్ కలర్ వేయడమంటే ముసుగు తొడిగి మాయచేయడమే అవుతుంది. అంతకంటే, వీధులకు ఇరుపక్కలా పచ్చటి చెట్లు పెంచితే అది హరితహారంలా కన్నుల పండువగా ఉంటుందన్నది ఇంకొందరి వాదన. హరితహారమన్నది ఎన్నాళ్లనుంచో నానుతున్న ఆలోచన. దీన్ని పట్టించుకోకుండా ఇప్పటికిప్పుడు రంగుపులిమి వీఐపీలను మాయలో పడేయాలనుకోవడం అధికారుల్లోని నాసిరకం ఆలోచనలకు అద్దంపడుతోంది. అంతేకాదు మనల్ని మనం మోసగించుకున్నట్లే అవుతుంది.
గన్నవరం నుంచి రామవర్పాడు రింగ్ వరకు గ్రీన్ గా మార్చడం సంగతి అటుంచితే, ఆ రోడ్డుపై ఉన్న ట్రాఫిక్, మురుగుకాలవల సమస్యలను ముందుగా పరిష్కరించిఉంటే బాగుండేది. భవంతులే కాకుండా, షాపులకు కూడా ఆకుపచ్చ కలర్ వేయాలనీ, అలాగే షాప్ నేమ్ బోర్డులు కూడా గ్రీన్ కలర్ తో ధగధగా మెరిసిపోవాలంటూ మున్సిపల్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని భవంతులు ఇంకా నిర్మాణ స్థాయిలోనే ఉన్నాయి. ఇటుకలు పేర్చినట్లున్న నిర్మాణాలపై కూడా ఆకుపచ్చ రంగు వేయడమేమిటో అధికారులే చెప్పాలి.
గ్రీన్ సిటీ అంటే ముసుగు తొడగడం కాదు, ఒరిజనల్ గా విజయవాడను గ్రీన్ సిటీగా మారిస్తే అంతా సంతోషిస్తారు. రాజధాని పరిధిని ప్రకటించి చాలానెలలే అయింది. రాజధాని పరిధిలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా హరితహారాన్ని అప్పుడే ప్రారంభించిఉంటే, ఈపాటికి రోడ్డుకి ఇరుపక్కలా చక్కటి చెట్లు పెరిగేవి. భవంతులకు ఒకే రంగు పులమడంకంటే, స్వాగత తోరణాల వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదిఏమైనా అధికారులు స్థానికులతో చర్చించకుండా తమ బుద్ధికి ఏది తోస్తే అదే గొప్పన్నట్లుగా రుద్దడం మంచిదికాదు.
– కణ్వస