పశువులను, పక్షులను మాత్రం హింసకు గురిచేసే వినోదక్రీడలను సమర్థించాలా? వాటిని హింసకు గురిచేస్తూ మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదం తెచ్చిపెట్టగల వినోద క్రీడలను సమర్థించాలా? అనే మీమాంస వచ్చినప్పుడు.. ఎవ్వరైనా సరే మొదటి దానికే ఓటు వేస్తారు. ఆ లెక్కన గమనించినప్పుడు.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదో ఒక రోజున మన కోస్తా కోడి పందేలను కూడా అధికారికంగా మార్చేస్తుందనే అభిప్రాయం కలుగుతోంది. అవును మరి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే పార్టీలు.. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో జల్లికట్టును అధికారికం చేసేస్తాం అని హామీ ఇచ్చినప్పుడు.. అదే తరహాలో జనం ఎమోషన్స్‌తో ముడిపడిన గోదావరి జిల్లాల కోడిపందేలను కూడా అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కొక్క పార్టీలు తమతమ మేనిఫెస్టోల్లో పోటాపోటీగా జనాకర్షక పథకాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా భాజపా విడుదల చేసిన మేనిఫెస్టోలో మిగిలిన పార్టీలు ప్రకటించిన మద్య నిషేధం ను యథాతథంగా ఉంచుతూనే.. సంక్రాంతి సమయంలో సాంప్రదాయంగా నిర్వహించే జల్లికట్టు క్రీడను అధికారికం చేసేస్తాం అంటూ భాజపా పేర్కొన్నది.
జల్లికట్టు క్రీడలో పశువులను విడచిపెట్టి వాటితో ప్రమాదకరమైన విధంగా యువతరం ఆడడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రీడలో పశువులను విపరీతంగా హింసకు గురిచేస్తుంటారు కూడా. ప్రతి ఏటా తమిళనాట జల్లికట్టు ఆటల్లో జరిగే ప్రమాదాల్లో ఒకరిద్దరు అయినా మరణించే దుర్ఘటనలు వెలుగుచూస్తూనే ఉంటాయి. అలాగే ప్రతి ఏటా పశువులను హింసకు గురిచేసే ఈ క్రీడల నిషేధం గురించి కోర్టులో పిటిషన్లు దాఖలు కావడం జరుగుతూనే ఉంటుంది.
ఇంచుమించుగా మన కోస్తా, గోదావరి జిల్లాల్లో కోడిపందేల పరిస్థితి కూడా అంతే. కోడిపందేల విషయంలో కూడా ప్రతిసారీ వాటి నిషేధం గురించి కోర్టుల్లో పిటిషన్లు పడతాయి. చివరికి ఫలితం మాత్రం ఉండదు. అయితే వీటిని అధికారికం చేసేస్తే ప్రభుత్వానికి బోలెడు లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పైపెచ్చు జల్లికట్టులో లాగా.. ఈ క్రీడలో మనుషులకు ప్రాణహాని కూడా ఉండదు. ఎటూ మనుషులు తినడానికే ఉద్దేశించిన కోళ్లను పందేనికి దించడం జరుగుతుందే తప్ప.. పశువులను హింసించడం వంటి వికృత క్రీడ కూడా ఉండదు. అలాంటి నేపథ్యంలో.. జల్లికట్టునే అధికారికం చేసేస్తాం అంటూ హామీ ఇచ్చిన భాజపా.. ఏదో ఒక నాడు ఏపీలో కోడి పందేలను కూడా అధికారికం చేయడానికి సిద్ధమవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.