విభజనచట్టంలోని హామీలు అన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయడమూ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వడం గురించి రాజ్యసభలో శుక్రవారం నాడు వేడివేడి చర్చ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఏపీ ప్రయోజనాల గురించి, వాటిని ఎగవేయడం గురించి, కేంద్రం సాగిస్తున్న వంచనల గురించి ప్రధాన చర్చ జరుగగా, ఏపీ కోటాలోనే ప్రస్తుతం ఉన్నప్పటికీ తెలంగాణకు తెరాస సీనియర్ ఎంపీ కే కేశవరావు మాత్రం కొత్తగా పోలవరం ప్రాజెక్టుకు కూడా ఫిటింగు పెట్టారు. పోలవరం డిజైన్ మార్చాలంటూ ఇప్పుడు కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీతో సత్సంబంధాల గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు ఇలా డిజైన్ మార్చాలనే డిమాండ్‌తో బ్రేకులు వేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు గులాబీబాస్నుంచి గ్రీన్‌సిగ్నల్ ఉందా లేదా? అనే చర్చ ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నది. అనూహ్యంగా కేకే ఈ పోలవరం డిజైన్ మార్పు అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావనకు తెచ్చారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కేవీపీ పెట్టిన ప్రెవేటు బిల్లుపై చర్చ ఇది. ఈ చర్చలో పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్పు గురించి కేకే తెరపైకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది నిరాశ్రయులు అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. జనం నిరాశ్రయులు అవుతున్న నేపథ్యంలోనే.. వారికి పునరావాసం లాంటి సమస్త బాధ్యతలూ ఏపీ ఖాతాలోకి వెళ్లేలా తెలంగాణలోని గ్రామాలను ఏపీకి తరలించడం విభజన చట్టం ద్వారా జరిగింది.
అయితే ఇప్పుడు కొత్తగా చట్టం ద్వారా ఏపీకి అప్పగించిన గ్రామాల్లో కొన్నింటిని తిరిగి తెలంగాణలో కలిపేయబోతున్నామని, ఇందుకు చంద్రబాబునాయుడు కూడా ఒప్పుకున్నారని.. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ఏపీ తరఫున మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. పోలవరాన్ని ప్రస్తుత ఆకృతి ప్రకారం కడితే.. కొన్ని గ్రామాలను తెలంగాణకు అప్పగించడం ఇదంతా సాధ్యమయ్యే పని కాదు! తెరాస తాజాగా వినిపిస్తున్న డిమాండ్ ‘డిజైన్ మార్పు’ అంశాన్ని పరిశీలించినప్పుడు .. గ్రామాల అప్పగింత వ్యవహారానికి దీనికి ఎక్కడో లింకు ఉన్నదా అనే అనుమానాలు కూడా జనానికి కలుగుతున్నాయి. పోలవరం డిజైన్ మార్పు అనే అంశం రాబోయే రోజుల్లో ప్రధానంగా తెరమీదకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.