ఏపీలో గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో జరిగిన గోల్ మాల్ వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఇది సాక్ష్యాలతో సహా దొరికిన స్కాంగా తేలుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా ముందు ఏపీపీఎస్సీ స్కాం సాక్ష్యాలను ప్రదర్శించారు. ఎపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ తో పాటు.. అప్పట్లో ఏపీపీఎస్సీకి కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ సీతారామాంజనేయులు అడ్డంగా ఇరుక్కున్నారు. వీరిద్దరూ చేసిన అక్రమాలకు సాక్ష్యాలను చంద్రబాబు ప్రదర్శించారు.
రాష్ట్ర యువతను దుర్మార్గంగా దగా చేసి వారి ఆశలు చంపేశారని.. క్షమించరాని నేరం చేసిన దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పు లేదని చంద్రబాబు మండిపడ్డారు. తిట్టేందుకు సరైన మాటలు కూడా రానంత నీచంగా వ్యవహరించారన్నారు. గౌతంగ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ అయ్యాక మళ్లీ వాల్యుయేషన్‌కు దురాలోచనకు తెరలేపారు .. వాల్యుయేషన్‌ను దాచిపెట్టి మళ్లీ రెండోసారి చేయాలని నిర్ణయించారన్నారు. మొదటి తప్పు ఏంటంటే.. డిజిటల్ వాల్యుయేషన్ చేయడం .. డిజిటల్ వాల్యుయేషన్ చేశాక మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది .. మాన్యువల్ వాల్యుయేషన్ తొక్కిపెట్టి మళ్లీ మరోసారి చేశారు ..కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు
మాన్యువల్ వాల్యుయేషన్‌కు వచ్చిన వారి ఖర్చులకు రూ.20 లక్షలు పెట్టారు . ఆవాస రిసార్ట్‌కు రూ.20 లక్షలు చెల్లించినట్లు బిల్లులు ఉన్నాయి . స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుంచి కానిస్టేబుళ్లను తీసుకొచ్చారన్నారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు అక్రమాల్లో భాగస్వామి అని.. వాల్యుయేషన్ ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల కోసం అక్రమాలకు పాల్పడ్డారన్నారు. గ్రూప్-1 అక్రమాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని.. ఏపీపీఎస్సీ చైర్మన్ సహా ఉన్న వారందరిని తప్పించాలన్నారు. గ్రూప్-1 అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సవాంగ్, సీతారామాంజనేయులు వీళ్లిద్దరూ దోషులే ..సవాంగ్, సీతారామాంజనేయులు వద్ద నుంచి ఐపీఎస్ హోదాను వెనక్కి తీసుకోవాలన్నారు.
పరిస్థితి చూస్తూంటే.. ప్రభుత్వం మారిన మరుక్షణం సీతారామాంజనేయులు, గౌతం సవాంగ్ జైలుకెళ్లక తప్పదన్న ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది. పైగా వీరిద్దరూ టీడీపీ నేతల్ని వేధించిన వారే. సీతారామాంజనేయులు అయితే ఇంటలిజెన్స్ చీఫ్ గా చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. అడ్డంగా దొరికిపోయిన వీరికి కౌంట్ డౌన్ స్టార్టయినట్లేనన్న అభఇప్రాయం వినిపిస్తోంది.