నరేంద్రమోడీ ప్రభుత్వ ప్రయత్నాలు అనుకున్నంతగా ఫలించలేదు. దేశంలో వృద్ధిరేటు తగ్గిపోయింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంగా వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. సోమవారం విడుదలైన గణాంకాలు ఈ వాస్తవాన్ని వెల్లడించాయి.
అంత క్రితం త్రైమాసికంలో 7.5 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈసారి కూడా అంతే నమోదవుతుందని, లేదా పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. కానీ అనూహ్యంగా తగ్గిపోయింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత్ పై విశ్వాసం పెరిగిందని, పరిస్థితి మారిందని, వృద్ధి రేటు పెరుగుతుందని కేంద్రం నమ్మకంగా ఉంది.
పలు విదేశీ సంస్థలు కూడా భారత్ వృద్ధి రేటు 7.5 లేదా 7.4 గా నమోదు కావచ్చని అంచనా వేశాయి. అంతేకాదు, వచ్చే రెండేళ్లలో చైనాను భారత్ అధిగమిస్తుందని కూడా పలు సంస్థలు అంచనాల లెక్కలు వెల్లడించాయి. ఈ గణాంకాల ప్రభావం వల్ల రేట్ కట్స్ డిమాండ్ పెరగవచ్చు. రెపో రేటు తగ్గించాలనే డిమాండ్ బలపడవచ్చని భావిస్తున్నారు.
జనవరిలో రిజర్వ్ బ్యాంక్ రెపొ రేటు తగ్గించింది. ఆ తర్వాత తగ్గింపు ఊసెత్తలేదు. వృద్ధి బాగుందని, ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని అంతా భావించారు. కానీ ఈ పరిస్థితుల్లో రేట్ కట్ అనివార్యమనే వాదనలు పెరిగితే కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తాయో చూడాలి.