చీమ కూడా దూరలేని దుర్భేద్యమైన కోటలాంటి ప్రాంతం. అందులో విశాలమైన గ్లాస్ చాంబర్. వణుకుపుట్టించే ఏసీ వాతావరణంలో కూడా అక్కడున్నవారి మోములపై చిరుచెమటలు. ముఖాలపై ఆతృత. ఆ కంటి చూపు వెనుక విజయకాంక్ష.. సోమవారం సాయంత్రం 5.28 గంటలకు వారిలోని ఉద్విగ్నత మరింత పెరిగిపోయింది. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో రాజ్యమేలిన ఉత్సుకత సరిగ్గా 18 నిముషాల తరవాత ఉద్వేగంగా మారిపోయింది. అక్కడి శాస్త్రజ్ఞులు చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ అభినందనలు తెలుపుకున్నారు.
క్రయోజెనిక్ యుగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాధించిన అత్యద్భుత విజయమిది. 200 ఏనుగులంత బరువున్న ర్యాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడమే కాక… ఉపగ్రహాన్ని జయప్రదంగా కక్ష్యలో ప్రవేశపెట్టడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అంతులేకుండా పోయింది. మానవ సహిత ర్యాకెట్ ప్రయోగాలకు వేదికను ఏర్పాటుచేసిన జిఎస్ఎల్వి మార్క్ 3 డి1 కోట్లాదిమంది భారతీయుల ఆశలను అంతరిక్షంలో రెపరెపలాడించింది. అందరిలోనూ ఈ ప్రయోగానికి ఆదిలో చిన్నపాటి బెరుకు, సంశయం. ఇస్రో రూపొందించిన ప్రతి ర్యాకెట్ తన తొలి ప్రయోగంలో విఫలమవుతూ వస్తుండడం దీనికి కారణం. ఈసారి చరిత్ర పునరావృతం కాలేదు. తిరగారాసింది. 3200కిలోల ఉపగ్రహాన్ని 143 అడుగుల పొడవున్న ర్యాకెట్ మండడం ప్రారంభించగానే..మొదలైన చప్పట్లు ప్రతి దశకూ మిన్నంటాయి. అంతరిక్షంలో ఉన్న ర్యాకెట్‌కు చేరాయి. ఆ ప్రోత్సాహంతోనా అన్నట్లు వాహన నౌకలోని అన్ని దశలూ క్రియాశీలంగా మారి పనిని కచ్చితంగా పూర్తిచేశాయి. సూళ్ళూరుపేటలో ప్రజలు ఇళ్ళెక్కి.. చెట్లెక్కీ.. తమ ప్రాంతానికి పేరు తెస్తున్న మార్క్ 3 వాహనాన్ని ఆరాధనాపూర్వకంగా చూశారు.
నిప్పులు చిమ్ముతూ నిబిడాకాశంలోకి రివ్వున దూసుకెళ్ళిన దృశ్యం అల్లంతదూరాన కనువిందు చేస్తూ మబ్బుల చాటుకు మాయమైంది. అదే సమయంలో అప్పటిదాకా వెండి అంచును పోలిన చీరను కట్టుకున్నట్టున్నట్లు రాష్ట్రమంతటా కమ్ముకున్న క్యుములోనింబస్ మేఘాలు శాస్త్రవేత్తలకు హర్షామోదాల్ని తెలుపుతున్నట్లు మృదువుగా వర్షించాయి. ఈదురు గాలులు విజయగీతాలాపన చేశాయి. రాష్ట్రపతి, ప్రధాని, ఏపీ ముఖ్యమంత్రి, తదితరులు తమ హర్షాన్ని వ్యక్తంచేసి, శాస్త్రజ్ఞులను అభినందనలతో ముంచెత్తారు. దేశీయంగా తయారైన క్రయోజెనిక్ ఇంజిన్ ఇస్రో ఆశలను సజీవంగా ఉంచింది. ప్రపంచాన్ని భారత్‌వైపు చూసేలా చేసింది. భవిష్యత్తు ప్రయోగాలకు బాటలు వేసింది. వాణిజ్యపరంగానూ ప్రయోగాలకు వేదికను నిర్మించింది. డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం, సతీష్ ధావన్, కస్తూరి రంగన్, వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల ఆశలకూ, కృషికీ సజీవ తార్కాణంగా నిలిచింది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి