సరుకులు సేవల బిల్లు(జిఎస్టి) 122వ రాజ్యాంగ సవరణను రాజ్యసభలో ఆమోదించడం పన్ను సంస్కరణ అని ప్రచారం మార్మోగిపోతున్నది.అన్నాడింఎకె వ్యతిరేకిస్తూ వాకౌట్‌తో సరిపెట్టింది. బిల్లు అమలుకు వచ్చేప్పుడు వివరంగా చర్చించాలని సిపిఎం కోరింది. ఇప్పుడు ఒకే విధమైన సరుకులపై మూడు రకాల పన్నులు వేర్వేరు రేట్లలో వుండటం వల్ల గజిబిజి అని జిఎస్టి ప్రతిపాదకులు వాదిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం విధించే పన్ను, కేంద్రం వేసే పన్ను, రాష్ట్రాల మధ్య రవాణాలో పడే పన్ను విభిన్నంగావుంటున్నాయి. మూలసరుకుమీద తదుపరి ఉత్పత్తిమీద పన్ను వేయడం వల్ల రెండుసార్లు చెల్లించనట్టవుతుంది. దానికి బదులు అదనంగా కలిసిన విలువ మీద వాల్యూ యాడెడ్మీద పన్ను వేస్తే సరిపోతుంది.
రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడం కోసం పోటీ పడి పన్నులు తగ్గించే అవకాశం వుండకుండా చేయొచ్చు- ఇవీ జిఎస్టికి అనుకూలంగా వచ్చిన మూడు ప్రధాన వాదనలు. వీటికి తోడు జిఎస్టి బిల్లు వల్ల జిడిపి రెండు శాతం పెరుగుతుందని చెప్పడం అత్యంత అసంబద్దం. అదే నిజమైతే ప్రపంచ దేశాలన్నీ దీన్ని విధించి జిడిపి పెంచుకుని వుండేవి. అన్నిటికీ ఆదర్శంగా చూపే అమెరికాలో కూడా జిఎస్టి లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పన్నులు విధించినా అక్కడ ఏకీకృత మార్కెట్ పేరుగుదలకు ఆటంకం లేకపోయింది. మన దేశం రాష్ట్రాల సమాఖ్య గనక తమ ఆదాయాల పెంపు ప్రజా సౌకర్యాల కల్పన ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చునని రాజ్యాంగం చెబుతుంది.దీన్ని నియంత్రించేందుకు జిఎస్టి కౌన్సిల్ అంటూ ఒకటి ఏర్పాటు చేయడమంటే రాజ్యాంగేతర వ్యవస్థను సృష్టించడమే. చర్చలో సీతారాం ఏచూరి చెప్పినట్టు కేరళలో బర్గర్లపై ఫ్యాట్టాక్స్ వేశారు. లేదా తప్పయినప్పటికీ మమతా బెనర్జీ ప్రభుత్వం శారదా చిట్‌ఫండ్ బాధితులను ఆదుకోవడానికి సెస్ వేసింది. మహారాష్ట్రకు వచ్చే ఆక్ట్రారు పన్ను చాలా రాష్ట్రాల మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువగా వుంటుంది.ఈ తేడాలు అనుకూల ప్రతికూలాలే సమాఖ్య విధానం విలక్షణతలు. వీటన్నిటినీ ఏకరూపంలోకి తేవడమంటటే రాష్ట్రాల హక్కులను హరించడమే.