మోడీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జి.ఎస్.టి) బిల్లుని పార్లమెంటు చేత ఆమోదింపజేసుకోవడానికి గత రెండున్నరేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. మోడీ ప్రభుత్వానికి లోక్ సభలో తగినంత బలం ఉంది కనుక అక్కడ ఆమోదింపజేసుకోగలిగింది కానీ రాజ్యసభలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలదే పైచెయ్యి కావడంతో అక్కడే ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ సూచించిన కొన్ని సవరణలని మోడీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో దానిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకొంటోంది. జూలై 18 నుంచి ఆగస్ట్ 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగబోతున్నాయి. ఈసారి జరిగే సమావేశాలలో కూడా దానిని అడ్డుకొంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ చెప్పారు. అయితే అందుకు మోడీ ప్రభుత్వాన్నే నిందించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజలపై అదనపు పన్నుల భారం మోపవద్దనే మా సూచనలు మోడీ ప్రభుత్వానికి నచ్చడం లేదు. అందుకే అది మొండి పట్టుదలతో జి.ఎస్.టి బిల్లుకి సవరణలు చేయకుండా రెండున్నరేళ్ళు గడిపేసింది. తిరిగి దానిని మేమే అడ్డుకొంటున్నామని దుష్ప్రచారం చేస్తోంది,” అని అన్నారు.
కానీ కాంగ్రెస్, భాజపాలు రెండూ కూడా పంతాలకి పోతుండటం వలననే ఇంతవరకు బిల్లు ఆమోదం పొందలేదని స్పష్టమవుతోంది. ఈసారి అన్నాడిఎంకె, డి.ఎం.కె. తృణమూల్ కాంగ్రెస్ తదితర కొన్ని పార్టీలు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ మిగిలిన అన్ని పార్టీలు బిల్లుకి మద్దతు ఇవ్వడానికి అంగీకరిస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకొన్నా బిల్లు ఆమోదం పొందే అవకాశాలున్నాయి.